గోపీచంద్‌ మరో అకాడమీ

5 Jun, 2018 10:18 IST|Sakshi
అకాడమీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఐటీఎం యూనివర్సిటీ చాన్స్‌లర్‌ పీవీ రమణ

నయా రాయ్‌పూర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో ఏర్పాటు

భూమి పూజ చేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌ సింగ్‌

నయా రాయ్‌పూర్‌: బ్యాడ్మింటన్‌ క్రీడలో భారత్‌ పేరును విశ్వవ్యాప్తం చేసిన కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లో కొత్త అకాడమీని ప్రారంభించారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ వంటి ఆణిముత్యాలను తీర్చిదిద్దిన ఆయన టాటా ట్రస్ట్స్‌ సహాయంతో రాయ్‌పూర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో ‘పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ’ని నెలకొల్పారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ చేతుల మీదుగా ఈ అకాడమీ భూమి పూజ సోమవారం చేశారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్‌తో పాటు కోచ్‌ సంజయ్‌ మిశ్రా, భారత స్టార్‌ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, టాటా ట్రస్ట్స్‌ ప్రతినిధులు ఆనంద్, నీలమ్, ఐటీఎం యూనివర్సిటీ చాన్స్‌లర్‌ పీవీ రమణ, వైస్‌ చాన్స్‌లర్‌ సంజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ అకాడమీలో అత్యాధునికమైన బ్యాడ్మింటన్‌ కోర్టులు, జిమ్, ఫిజియోథెరపీ న్యూట్రిషన్‌ ల్యాబ్, బయో మెకానిక్స్‌ ల్యాబ్స్‌తో పాటు కోచ్‌లు, సిబ్బందికి నివాస వసతిని ఏర్పాటు చేస్తారు. భారత జాతీయ జూనియర్‌ కోచ్‌ సంజయ్‌ మిశ్రా అకాడమీ బాధ్యతలను చూసుకుంటారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఛత్తీస్‌గడ్‌లో క్రీడాభివృద్ధికి గోపీచంద్‌ అకాడమీ దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రీడా ప్రతిభకు లోటు లేదన్న రమణ్‌ సింగ్‌ సరైన సమయంలో ఈ అకాడమీని ఏర్పాటు చేశారని అన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి అకాడమీ ఉండటంతో విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందుతారని అన్నారు. త్వరలోనే ఈ అకాడమీ నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రమణ్‌ సింగ్‌ మాటలతో ఏకీభవించిన కోచ్‌ గోపీచంద్‌ వచ్చే తరంలో స్టార్‌ ప్లేయర్లంతా ఛత్తీస్‌గఢ్‌ నుంచే వస్తారని అన్నారు. ఐటీఎం సహకారంతో చదువుతో పాటు సమాంతరంగా క్రీడలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌లో దూసుకుపోతున్న శ్రీకాంత్, ప్రణయ్‌ ఐటీఎం యూనివర్సిటీ బ్రాండ్‌ అంబాసిడర్లు కావడం విశేషం. యూనివర్సిటీలో అకాడమీ ఏర్పాటు చేయడం ఎంతోమంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని వారన్నారు. గోపీచంద్‌లాంటి గురువు పర్యవేక్షణలో ఐటీఎం యూనివర్సిటీ నుంచి చాంపియన్‌లు పుట్టుకొస్తారని విశ్వాసం కనబరిచారు. ప్రస్తుతం గోపీచంద్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తోపాటు పశ్చిమ గోదావరిలోని తణుకు, గ్రేటర్‌ నోయిడా, గ్వాలియర్, వడోదరల్లో అకాడమీలు నడుస్తున్నాయి. 

మరిన్ని వార్తలు