ఇలా అయితే కష్టమే 

22 Jun, 2020 00:00 IST|Sakshi

ఫామ్‌లోకి రావాలంటే మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కావాలి

క్యాలెండర్‌ మారక తప్పదు

చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌

మ్యాచ్‌ ప్రాక్టీస్‌కు దూరమయ్యేకొద్దీ క్రీడాకారులు తిరిగి గాడిన పడటం కష్టమవుతుందని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో ఆటకు ఇలాంటి ఎడబాటు ఎప్పుడూ లేదన్నారు. ఇది ఆటగాళ్ల ఆటతీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు.

న్యూఢిల్లీ: సుదీర్ఘ లాక్‌డౌన్‌ ఆటగాళ్ల ఆటతీరును ప్రభావితం చేసే ప్రమాదముందని, ఇన్ని నెలలుగా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోతే మళ్లీ పూర్తిస్థాయి ఫామ్‌లోకి రావడం చాలా కష్టమవుతుందని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తెలిపారు. ఇది ప్లేయర్లకే కాదు... ద్వితీయశ్రేణి కోచ్‌లు, క్రీడా పరికరాల దుకాణాలకు నష్టాలనే తెచ్చిపెట్టిందన్నారు. మీడియాకిచ్చిన ఇంటర్వూ్యలో ఈ 46 ఏళ్ల చీఫ్‌ కోచ్‌ పలు అంశాలపై స్పందించారు.

ఇలాగే కొనసాగితే... 
ఆటలు, పోటీలు లేకపోవడం ఇప్పటికైతే ఫర్వాలేదు కానీ ఇదే పరిస్థితి ఇంకో నెల, నెలన్నర కొనసాగితే మాత్రం ఆటగాళ్లకు కష్టమే! వాళ్ల సహనానికి ఇది కచ్చితంగా విషమ పరీక్షే అవుతుంది. లాక్‌డౌన్‌ మొదటి నెలంతా విశ్రాంతి తీసుకున్నారు. కొందరైతే గతంలో చేయని పనుల్ని సరదాగా చేసి మురిశారు. తర్వాత రెండు నెలలు కసరత్తు ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ట్రెయినింగ్‌లో నిమగ్నమయ్యారు. ఇక్కడ ఆటగాళ్లకు శారీరక, మానసిక సవాళ్లు ఎదురవుతాయి. విశ్రాంతితో మానసిక బలం చేకూరుతుందేమో కానీ... నెలల తరబడి ఇలాగే ఉంటే ఫిట్‌నెస్‌ (శారీరక), ఫామ్‌ సమస్యలు తప్పవు. పైగా ఒలింపిక్స్‌కు ముందు ఇది మరింత ప్రమాదకరం కూడా!

తొలిసారి ఈ ఎడబాటు...
నా కెరీర్‌లో నేనెప్పుడూ ఇన్ని నెలలు బ్యాడ్మింటన్‌కు దూరం కాలేదు. ఆటగాడి నుంచి కోచ్‌ అయ్యేదాకా ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి. ఆన్‌లైన్‌ కోచింగ్, ఫిట్‌నెస్‌ సెషన్లతో అందుబాటులో ఉండటం ద్వారా ఆ వెలితిని కాస్త పూడ్చుకోగలుగుతున్నా. నా వరకైతే ఇది ఓకే. ఈ తీరిక సమయాన్ని చదివేందుకు, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేందుకు వినియోగించుకుంటున్నా. కోచింగ్‌ డెవలప్‌మెంట్‌ వర్క్‌షాప్‌లతో బిజీగా మారుతున్నా. ఎటొచ్చి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేని ఆటగాళ్లకే ఇది నష్టం.

మారే క్రీడా క్యాలెండర్‌...
కరోనా పరిస్థితులతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) టోర్నీలన్నీ వాయిదా వేసింది. కొన్ని రద్దు చేసింది. సాధారణంగా ప్రత్యేకించి ఏదైనా దేశం, టోర్నీ వాయిదా పడితే అందులో ఆడేవారిపై ప్రభావం పడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా వేరు. ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్‌ నిబంధనలు, వీసాలతో ఇపుడు ఏ టోర్నీ అయినా ఆగొచ్చు. క్రీడా క్యాలెండర్‌ మరిన్ని మార్పులకు గురికావొచ్చు.

కోచ్‌లకూ కష్టకాలం... 
ఈ ప్రతిష్టంభనతో ఒక్క ఆటగాళ్లే కాదు దీన్ని నమ్ముకున్న కోచ్‌లు, క్రీడా పరికరాల షాపులకు నష్టాలే. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు సెలవులతో ఉంటాయి. అప్పుడు పిల్లలంతా ఆటలపై మరలుతారు. క్రీడా వస్తువులు కొంటారు. స్థానిక కోచ్‌లతో తమ ఆటల ముచ్చట తీర్చుకుంటారు. కానీ ఈసారి పరిస్థితి తిరగబడింది. ప్రొఫెషనల్‌ కోచ్‌లకు ఏ ఇబ్బంది లేకపోయినా ఢిల్లీలోని సిరిఫోర్ట్, త్యాగరాజ్‌ స్టేడియాల్లో స్వతంత్రంగా పనిచేసే కోచ్‌లకు జీవనాధారం కరువైంది. ఇలాంటి వారి కోసం అర్జున అవార్డీలు అశ్విని నాచప్ప, మాలతి హోలలతో కలిసి ‘రన్‌ టు ద మూన్‌’ పేరిట నిధులు సేకరించాలని నిర్ణయించాం.

మరిన్ని వార్తలు