'సచిన్ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తాం'

14 May, 2016 15:39 IST|Sakshi
'సచిన్ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తాం'

ముంబై: సెలెబ్రిటీలు అంబాసిడర్లుగా ఉన్న కంపెనీ లేదా సంస్థ ఉత్పత్తులు కొని మోసపోయామంటూ ఆయా సెలెబ్రిటీలపై వినియోగదారులు కేసులు వేసిన సంఘటనల గురించి  విన్నాం. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కంపెనీ తనను మోసం చేసిందని తాజాగా పుణె వాసి వాపోతున్నాడు. ఈ విషయంలో సచిన్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 నుంచి ముంబైలోని బాంద్రాలో గల సచిన్ నివాసం ముందు తన కుటుంబ సభ్యులతో కలసి నిరవధిక నిరాహారదీక్ష చేపడుతానని సందీప్ ఖుర్హడే అనే ల్యాబ్ టెక్నీషియన్ హెచ్చరించాడు.  ఆయన చెప్పిన వివరాలిలా ఉన్నాయి.

రియల్ ఎస్టేట్ సంస్థ అమిత్ ఎంటర్ ప్రైజెస్కు సచిన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు. పుణెలో పెద్దల ద్వారా సందీప్కు సంక్రమించిన భూమిని, ఆయన మామ శివాజీ పింజన్ సమ్మతితో  నాలుగేళ్ల క్రితం అమిత్ ఎంటర్ ప్రైజెస్ కొనుగోలు చేసింది. దీని విలువ రెండు కోట్ల రూపాయలు కాగా, అప్పట్లో అమిత్ ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యం సందీప్కు 20 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించింది. కాగా ఈ ఆస్తిలో శివాజీ వాటా కింద ఆయనకు కోటి 50 లక్షల రూపాయలు చెల్లించింది. ఈ నేపథ్యంలో సచిన్ అమిత్ ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యంతో మాట్లాడి తనకు న్యాయం చేయాలని సందీప్ కోరుతున్నాడు.

'సచిన్ గురించి ఎంతో విన్నాం. ఆయన మానవతావాది, ఇతరులకు సాయం చేసే వ్యక్తి. బిల్డర్ నుంచి తమకు న్యాయం చేయాలని కోరుతూ సచిన్ ఇంటి ఎదుట దీక్ష చేపడుతాం' అని సందీప్ చెప్పాడు. బాంద్రా పోలీస్ స్టేషన్ ఏసీపీకి ఈ మేరకు లేఖ రాశారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా సందీప్ పోలీసులను కోరాడు.

కాగా సందీప్ ఆరోపణలను అమిత్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం కొట్టిపారేసింది. 'సందీప్ తల్లి రంజన ఆ ఆస్తిపై గల హక్కులను ఆమె తమ్ముడు శివాజీకికి బదలాయించింది. ఆమె తన భర్త సమక్షంలోనే ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేయించింది. శివాజీ ఈ డీడ్ తమకు సమర్పించాడు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధిత కాపీని తీసుకుని సరిచూసుకున్న తర్వాతే భూమి కొనుగోలు చేశాం. శివాజీ నుంచి ఈ భూమిని కోటి 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాం.  ఆయన కోరిక మేరకు రంజనకు 20 లక్షలు చెల్లించాం' అని అమిత్ ఎంటర్ప్రైజెస్ యజమానులు చెప్పారు.  ప్రస్తుతం తమ సంస్థకు సచిన్తో సంబంధం లేదని వివరించారు. సచిన్ 2000 నుంచి 2014 వరకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని తెలిపారు.

>
మరిన్ని వార్తలు