సెమీస్‌లో పుణే సెవెన్‌ ఏసెస్‌ 

4 Feb, 2020 01:38 IST|Sakshi

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ ఐదో సీజన్‌

సాక్షి, హైదరాబాద్‌: మరో అద్భుత ప్రదర్శనతో నాలుగో విజయం నమోదు చేసుకున్న పుణే సెవెన్‌ ఏసెస్‌ జట్టు ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌లో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పుణే 4–1తో అవధ్‌ వారియర్స్‌పై గెలుపొందింది. తద్వారా 18 పాయింట్లను ఖాతాలో వేసుకున్న పుణే... పాయింట్ల పట్టికలో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ఇప్పటికే చెన్నై సూపర్‌ స్టార్స్, నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ సెమీస్‌ లోకి అడుగుపెట్టాయి. మిగిలిన మరో బెర్త్‌ కోసం  నాలుగు జట్లు పోటీపడుతున్నాయి.

పురుషుల డబుల్స్‌లో కొ సుంగ్‌ హ్యూన్‌–షిన్‌ బేక్‌ (అవధ్‌ వారియర్స్‌) జోడీ 6–15, 15–9, 15–12తో చిరాగ్‌ శెట్టి–సెతియావన్‌ (పుణే) జంటపై గెలుపొంది అవధ్‌ వారియర్స్‌కు శుభారంభం ఇచ్చింది. అయితే అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ‘ట్రంప్‌ కార్డు’తో ఆడిన అవధ్‌ వారియర్స్‌ ప్లేయర్‌ బీవెన్‌ జాంగ్‌ 13–15, 12–15తో రితుపర్ణ (పుణే) చేతిలో ఓడటంతో... అవధ్‌ వారియర్స్‌కు ఒక పాయింట్‌ పెనాల్టీ పడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్రిస్టీనా పెడర్సన్‌–సొజొనోవ్‌ (అవధ్‌ వారియర్స్‌) జంట 6–15, 9–15తో క్రిస్‌–గాబ్రియెల్‌ (పుణే) ద్వయం చేతిలో ఓడింది. దాంతో పుణే 2–0తో ఆధిక్యంలోకెళ్లింది. పురుషుల తొలి సింగిల్స్‌లో ‘ట్రంప్‌ కార్డు’తో ఆడిన కీన్‌ యూ లోహ్‌ (పుణే) 15–12, 15–14తో శుభాంకర్‌ డే (అవధ్‌ వారియర్స్‌)పై గెలిచాడు. చివరగా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో కజుమస సకాయ్‌ (పుణే) 15–6, 10–15, 13–15తో అజయ్‌ జయరామ్‌ (అవధ్‌ వారియర్స్‌) చేతిలో ఓడాడు. నేటి మ్యాచ్‌ల్లో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌తో చెన్నై సూపర్‌ స్టార్స్‌; బెంగళూరు రాప్టర్స్‌తో ముంబై రాకెట్స్‌ తలపడతాయి.

మరిన్ని వార్తలు