పంజాబ్‌ హాకీ ‘పోరు’

26 Nov, 2019 03:15 IST|Sakshi

మైదానంలో గొడవకు దిగిన రెండు జట్లు

న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ హాకీ టోర్నమెంట్‌ ఫైనల్లో పంజాబ్‌ పోలీస్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) జట్ల ఆటగాళ్లు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మ్యాచ్‌ మూడో క్వార్టర్‌లో పంజాబ్‌ పోలీస్‌ సర్కిల్‌లోకి దూసుకొచ్చిన పీఎన్‌బీ గోల్‌ అవకాశం సృష్టించుకునే ప్రయత్నంలో ఉండగా ఇది జరిగింది. ఒక్కసారిగా ఇరు జట్ల ఆటగాళ్లు మాటలను దాటి ముష్టిఘాతాలకు దిగారు. ఆ తర్వాత హాకీ స్టిక్‌లతో ఒకరితో మరొకరు తలపడ్డారు. మ్యాచ్‌ అధికారులు కలగజేసుకొని ఆపే వరకు ఇది కొనసాగింది.

ఆ సమయంలో స్కోరు 3–3తో సమంగా ఉంది. రిఫరీలు ఇరు జట్ల నుంచి ముగ్గురేసి ఆటగాళ్లను రెడ్‌ కార్డుల ద్వారా బయటకు పంపి 8 మంది సభ్యుల జట్లతోనే మ్యాచ్‌ను కొనసాగించారు. చివరికి 6–3తో గెలిచిన పీఎన్‌బీ టైటిల్‌ సొంతం చేసుకుంది. తాజా ఘటనతో ఈ టోర్నీలో పాల్గొనకుండా నిర్వాహకులు పంజాబ్‌ పోలీస్‌పై నాలుగేళ్లు, పీఎన్‌బీపై రెండేళ్ల నిషేధం విధించారు.

>
మరిన్ని వార్తలు