సింధు ముందుకు... సైనా ఇంటికి

27 Apr, 2017 01:16 IST|Sakshi
సింధు ముందుకు... సైనా ఇంటికి

సైనా నెహ్వాల్‌కు షాక్‌.. ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

వుహాన్‌: చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత నం.1 షట్లర్‌ పీవీ సింధు, అజయ్‌ జయరామ్‌ ప్రిక్వార్టర్స్‌కు చేరారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 21–8, 21–18తో దినార్‌ ద్యా ఆయుస్తీన్‌ (ఇండోనేసియా)పై అలవోక విజయం సాధించింది. కేవలం 31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు జోరుకు ప్రత్యర్థి బేజారైంది. తొలిగేమ్‌లో ఆరంభంలోనే 8–2తో ఆధిక్యంలోకి వెళ్లినా సిందు అదే జోరు కొనసాగించి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే రెండోగేమ్‌లో ప్రత్యర్థి నుంచి సింధుకు కొంచెం ప్రతిఘటన ఎదురైంది. ఆరంభంలో 7–1తో భారత స్టార్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వరుసగా మూడు పాయింట్లు సాధించిన దినార్‌.. 4–7తో ప్రతిఘటించింది. ఈ దశలో ఆధిపత్యం ప్రదర్శించిన సింధు వరుసగా పాయింట్లు సాధించి 17–5, 19–10తో విజయం ముంగిట నిలిచింది.

ఈదశలో వరుసగా ఏడు పాయింట్లు సాధించిన దినార్‌ 17–19తో ఆధిక్యాన్ని బాగా తగ్గించింది. ఈదశలో తేరుకున్న సింధు త్వరత్వరగా రెండు పాయింట్లు సాధించి ప్రత్యర్థి ఆట కట్టించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్, ప్రపంచ 13వ ర్యాంకర్‌ జయరామ్‌ 21–18, 18–21, 21–19తో ఐదో సీడ్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ తియాన్‌ హువీ (చైనా)కు షాకిచ్చాడు. 70 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా శ్రమించిన జయరామ్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో అయా ఒహోరీ (జపాన్‌)తో సింధు, హుసు జెన్‌ హావో (చైనీస్‌తైపీ)తో జయరామ్‌ తలపడనున్నారు. మరోవైపు తొలిరౌండ్‌లోనే ప్రపంచ మాజీ నం.1 ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ సైనా 21–19, 16–21, 18–21తో ప్రపంచ 16వ ర్యాంకర్‌ సయాక సాటో (జపాన్‌) చేతిలో పోరాడి ఓడింది.

పురుషుల విభాగం తొలిరౌండ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 16–21, 21–13, 19–21తో క లాంగ్‌ అంగూస్‌ (హాంకాంగ్‌) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరోవైపు డబుల్స్‌ విభాగంలోనూ భారత పోరాటం ముగిసింది. తొలుత జరిగిన పురుషు డబుల్స్‌ తొలిరౌండ్‌లో మనూ అత్రి–సుమీత్‌రెడ్డి జంట 21–9, 21–18తో ఐదోసీడ్, చైనీస్‌ ద్వయం ఫూ హాయ్‌ఫెంగ్‌–జాంగ్‌ నాన్‌ చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జంట 20–22, 16–21తో దక్షిణ కొరియా జంట, చే యూ జెంగ్, కిమ్‌ సో యెంగ్‌ చేతిలో.. జక్కంపూడీ మేఘన–పూర్విషా జంట 11–21, 16–21తో దక్షిణ కొరియా జంట క్యుంగ్‌ ఉన్‌ జుంగ్‌–సెయుంగ్‌ చాన్‌ షిన్‌ చేతిలో ఓడిపోయింది. మరోవైపు  మిక్సడ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ జెర్రీ చోప్రా–సిక్కిరెడ్డి జంట 15–21, 21–14, 16–21తో టాప్‌ సీడ్, చైనీస్‌ జంట జెంగ్‌ సీవీ–చెన్‌ కింగ్‌చెన్‌ చేతిలో పరాజయం పాలయ్యింది. 

>
మరిన్ని వార్తలు