సైనా, సింధు ముందుకు...

26 Apr, 2019 02:08 IST|Sakshi

సమీర్‌ వర్మ కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి

మరో విజయం సాధిస్తే ముగ్గురికీ పతకాలు ఖాయం

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

వుహాన్‌ (చైనా): గత ఏడాది ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి భారత్‌కు సింగిల్స్‌ విభాగాల్లో ఒకేసారి రెండు కాంస్య పతకాలు లభించాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈసారి ఏకంగా మూడు పతకాలు మన ఖాతాలో జమయ్యే అవకాశముంది. తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌... పురుషుల సింగిల్స్‌ విభాగంలో సమీర్‌ వర్మ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకొని పతకానికి విజయం దూరంలో నిలిచారు.

ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఇప్పటివరకు సైనా మూడు కాంస్య పతకాలను (2010, 2016, 2018లలో)... సింధు (2014లో) ఒక కాంస్య పతకాన్ని సాధించారు. గత ఏడాది పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఏడో సీడ్‌ సైనా 21–13, 21–13తో కిమ్‌ గా యున్‌ (కొరియా)పై గెలుపొందగా... నాలుగో సీడ్‌ సింధు 21–15, 21–19తో చురిన్నిసా (ఇండోనేసియా)ను ఓడించింది. కిమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైనా ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. కేవలం 38 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది.

చురిన్నిసాతో జరిగిన మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సింధు 17–19తో వెనుకబడిన దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి విజయతీరాలకు చేరింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మ 21–12, 21–19తో ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)పై గెలిచాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఉత్కర్‌‡్ష–కరిష్మా (భారత్‌) ద్వయం 10–21, 15–21తో ఫైజల్‌–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో... వెంకట్‌–జూహీ దేవాంగన్‌ (భారత్‌) జంట 10–21, 9–21తో వాంగ్‌ యిలు–హువాంగ్‌ డాంగ్‌పింగ్‌ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయాయి.  

మరిన్ని వార్తలు