సింధు.. ది బ్రాండ్‌

28 Aug, 2019 10:26 IST|Sakshi

ప్రపంచ కప్‌ విజయంతో పెరిగిన బ్రాండ్‌ వాల్యూ

20 బ్రాండ్స్‌కు పీవీ సింధు ‘ప్రచార’ ప్రాతినిధ్యం

చైనాకు చెందిన ‘లీ నిన్గ్‌’ సంస్థతో రూ.50 కోట్ల ఒప్పందం

ఇదే పెద్ద డీల్‌.. అంబాసిడర్‌గా 2023 వరకు

క్రికెటర్‌ కోహ్లీ తర్వాత స్థానం సింధూదే

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో ప్రపంచంలో 7వ స్థానం

పీవీ సింధు...భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించి..నాలుగు దశాబ్దాల కలను సాకారం చేసిన ఈ క్రీడాకారిణి ఇప్పుడు భారత్‌లో అత్యంత విలువైన మహిళా ప్లేయర్‌గా నిలుస్తోంది. బ్రాండ్‌లకే బ్రాండ్‌గా మారింది. అటు క్రీడలోనే కాకుండా.. ఇటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన పీవీ సింధు ‘బ్రాండ్‌ వాల్యూ’ ఇప్పుడు మరింత పెరిగింది. ఫోర్బ్స్‌ లిస్ట్‌ ప్రకారం ఆమె ప్రపంచంలోనే 7వ స్థానంలో నిలిచింది.

సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన వారి వివరాలు, అత్యంత ఆదాయం అందుకుంటున్న వారి గురించి ప్రతి సంవత్సరం ‘ఫోర్బ్స్‌’ ప్రపంచ వ్యాప్తంగా ఓ లిస్ట్‌ని విడుదల చేస్తూ ఉంటుంది. లిస్ట్‌లో అత్యంత ఆదాయాన్ని సంపాదిస్తున్న వారు ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్‌లే అధికం. ఆ క్రికెటర్‌ల జాబితాలో బ్యాడ్మింటన్‌ దిగ్గజం, మన హైదరాబాదీ పీవీ సింధు చేరడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉంటూ అత్యంత ఆదాయం పొందుతూ ఉమెన్‌ కేటగిరిలో 7వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్‌ ప్రకటించింది. జనవరిలో విడుదల చేసిన లిస్ట్‌లో అమెరికా టెన్నిస్‌ స్టార్‌ ‘మెడిసన్‌ కీస్‌’తో పాటు ప్రపంచవ్యాప్తంగా పీవీ సింధు 13వ స్థానంలో ఉండటంగమనార్హం.

కోహ్లీ తర్వాత సింధునే...
ఫోర్బ్స్‌ లిస్ట్‌ను పరిశీలిస్తే క్రీడారంగం నుంచి క్రికెటర్‌లే అధికంగా కనిపిస్తారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌టెండుల్కర్, ఎం.ఎస్‌.ధోనీలు ఒకప్పుడు అత్యధిక సంపాదన కలిగిన వారని ఫోర్బ్స్‌ని ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ తను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల నుంచి రోజు వారి ఆదాయం రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడు. దేశంలో కోహ్లీనే అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఇప్పుడు ఆయన తర్వాత స్థానంలో రోజుకు దాదాపు  రూ.1.50 కోటి తీసుకుంటూ ద్వితీయ స్థానంలో నిలిచింది సింధు. 

సింధు బ్రాండ్లు ఇవే
చైనాకు చెందిన ‘లీ నీన్గ్‌’(స్పోర్ట్స్‌ మెటీరియల్‌) సంస్థతో పీవీ.సిం«ధు రూ.50 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలో ఆ సంస్థకు చెందిన ప్రకటనలు అన్నింటిలో పీవీ సిం«ధునే కనిపించనుంది. ఈ కాంట్రాక్ట్‌ను ఆ సంస్థతో 2023 వరకు కుదుర్చుకోవడం జరిగింది. దీంతో పాటు ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ‘మంత్రా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, జీఎస్‌టీ, జేబీఎల్‌ ఇయర్‌ఫోన్స్, బ్రిడ్జ్‌స్టోన్‌ టైర్స్, మూవ్‌ పెయిన్‌ రిలీఫ్‌ అయింట్‌మెంట్, స్పోర్ట్స్‌ ఎనర్జీ డ్రింక్‌ గట్రోడ్, వైజాగ్‌ స్టీల్స్, సెంట్రల్‌ రిజర్వ్‌ సెక్యూరిటీ ఫోర్స్, శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్, హర్మన్‌ ఇంటర్నేషనల్‌ ఫర్‌ జీబీఎల్‌ ఎండూరెన్స్‌ ఇయర్‌ఫోన్స్, పానసోనిక్‌ బ్యాటరీస్, ఎపిస్‌ హనీ, ఓజాస్విత (శ్రీశ్రీ ఆయుర్వేద), యోనెక్స్, స్ట్రేఫీ, ఫ్లిప్‌కార్ట్, బూస్ట్‌’ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు సిం«ధు అంబాసిడర్‌గా ఉన్నారు. ఇటీవల ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన సిం«ధు పట్ల ఆయా బ్రాండ్‌ల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ మార్కెట్‌ వాల్యూస్‌ కూడా పెరగబోతున్నట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

కూల్‌డ్రింక్స్‌కి దూరం
థమ్స్‌అప్, కోకోకోలా, పెప్సీ, మజా వంటి కూల్‌ డ్రింక్స్‌కి సిం«ధు చాలా దూరం. అందుకే ఆ కంపెనీల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా పక్కన పెట్టేసింది. ఒకానొక సమయంలో కంపెనీల యాజమాన్యాలు సింధు చుట్టూ ప్రదక్షిణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. వాటివల్ల హాని ఏదైనా ఉంటుందని చెప్పకపోయినప్పటికీ సింధు మాత్రం నిజ జీవితంలో కూడా వాటిని ప్రిఫర్‌ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. 

బ్రాండ్స్‌ ఆనందం
ఇటీవల ప్రపంచ బ్యాండ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ని సిం«ధు కైవసం చేసుకోవడంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాండ్ల యజమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆమె విజయం అనంతరం సోషల్‌ మీడియా ద్వారా పీవీ సింధుపై పొగడ్తలు గుప్పించడం విశేషం. సింధు అద్భుతమైన క్రీడాకారిణి అని, ఆమె వల్ల తమ వ్యాపారం విలువ మరింత పెరుగుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆమె మరిన్ని విజయాలు సాధిస్తుందని పేర్కొన్నారు.     

సంతోషమే కదా
మా అమ్మాయి ఇన్ని ప్రముఖ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా ఉంటోంది అంటే నిజంగా సంతోషకరమైన విషయమే. కష్టపడింది. ఓటమిని తట్టుకుని నిలబడింది. ఈ రోజు ప్రతి విజయంతో యావత్‌ భారతావనిని సంతోషపరుస్తుంది. రోజు రోజుకి మార్కెట్‌ వాల్యూ పెరుగుతోంది కాబట్టి ప్రముఖ బ్రాండ్‌ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఫోర్బ్స్‌ జాబితాలో కూడా సింధు పేరు ప్రకటించడం ఆనందంగా ఉంది. – వెంకటరమణ, సింధు తండ్రి

గోపీచంద్‌ అకాడమీలో మీడియాతో మాట్లాడుతున్న సింధు..చిత్రంలో సాయి ప్రణీత్, గోపీచంద్‌

మరిన్ని వార్తలు