క్రీడలతో కోవిడ్‌ను ఓడిద్దాం 

23 Jun, 2020 00:02 IST|Sakshi

ప్రపంచ చాంపియన్‌  పీవీ సింధు పిలుపు

హైదరాబాద్‌: ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు పెరిగిపోతుండగా, మరోవైపు ఇప్పటి వరకు దాని నివారణ కోసం ఎలాంటి మందూ అందుబాటులోకి రాలేదు. ఇలాంటి నేపథ్యంలో శారీరక శ్రమ ద్వారానే శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ప్రయత్నించాలని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌  పీవీ సింధు పిలుపునిచ్చింది. కోవిడ్‌–19 ప్రభావాన్ని అడ్డుకునేందుకు  వివిధ రకాల ఆటలు ఆడటంపై దృష్టి పెట్టాలని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుత స్థితిలో అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచనలను అంతా తప్పక పాటించాలని ఆమె చెప్పింది. ‘శరీరంలో బలమైన రోగనిరోధక వ్యవస్థ కోసం ఆటలు ఆడాలి. శరీరాన్ని శ్రమకు గురి చేసే ఇతర కార్యక్రమాల్లో కూడా భాగం కావాలి. హృద్రోగాలు, డయాబెటిస్, బీపీ, క్యాన్సర్, డిప్రెషన్‌ తదితర వ్యాధులను ఎదుర్కొనేందుకు వారంలో కనీసం 300 నిమిషాలు ఎక్సర్‌సైజ్‌ చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచిస్తోంది. ముఖ్యంగా కరోనాలాంటి సమయంలో దీని అవసరం చాలా ఉంది. కొత్తగా ప్రయత్నించేందుకు ఇదే మంచి అవకాశంగా భావించండి. ఒక క్రీడాకారిణిగా ఎక్సర్‌సైజ్‌లు చేయమని సలహా ఇస్తున్నా. ప్రతీ ఒక్కరు ఇందుకోసం కనీసం 45 నిమిషాలైనా కేటాయించాలి’ అని సింధు సూచించింది.

>
మరిన్ని వార్తలు