‘నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను’

16 Dec, 2018 20:56 IST|Sakshi

గ్వాంగ్‌జూ (చైనా) : ప్రతిష్టాత్మక వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా పీవీ సింధు చరిత్రకెక్కారు. ఆదివారం (డిసెంబర్ 16న) జరిగిన ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహారపై సింధు విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో 21-19, 21-17 తేడాతో నెగ్గిన పీవీ సింధు బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన అనంతరం సింధు మీడియాతో మాట్లాడుతూ.. తన సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పారు.(సింధు నయా చరిత్ర)

‘టైటిల్‌ గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ఏడాది ముగింపులో మేజర్‌ టైటిల్‌ గెలిచాను. స్వర్ణం సాధించినందుకు గర్వంగా ఉంది. నాకు తోడుగా నిలిచిన అభిమానులకు, కోచ్‌కు ధ్యనవాదాలు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లోనూ ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాను’ అని పీవీ సింధు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

మరిన్ని విజయాలు సాధించాలి: వైఎస్‌ జగన్‌
ప‍్రతిష్టాత్మక వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ను తొలిసారి గెలిచిన తెలుగు తేజం పీవీ సింధుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయ పరంపరం ఇలానే కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు. ‘నీ విజయం దేశానికే గర్వకారణం’  వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు