'ఫైనల్‌ ఫోబియా'ను నేను నమ్మను

8 Aug, 2018 01:38 IST|Sakshi

ఒక మ్యాచ్‌లో పరాజయం అంతకుముందు అద్భుత ప్రదర్శన స్థాయిని తగ్గించదు

స్వర్ణం కోసం మరింత కష్టపడతా

‘సాక్షి’తో పీవీ సింధు  

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌  షిప్‌లో నాలుగో పతకంతో తెలుగమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు చరిత్ర సృష్టించింది. టోర్నీలో అద్భుతంగా రాణించిన ఆమె,     దురదృష్టవశాత్తూ వరుసగా రెండో ఏడాది కూడా రజతంతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇది ఆమెతో పాటు భారత అభిమానులను కూడా నిరాశ పర్చింది. అయితే కిందపడిన ప్రతీసారి అంతే వేగంగా పైకి లేవడం తనకు అలవాటేనని, సుదీర్ఘ కెరీర్‌లో     ఇలాంటి ఓటములు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవన్న సింధు... మరోసారి  స్వర్ణమే లక్ష్యంగా శ్రమిస్తానని పట్టుదలగా చెబుతోంది.  

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మక టోర్నీలలో గతంలో ఫైనల్లో పరాజయం ఎదురైనప్పుడల్లా తీవ్ర వేదనకు గురయ్యేదాన్నని, ఇప్పుడు స్థితప్రజ్ఞత అలవర్చుకున్నానని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు వ్యాఖ్యానించింది. ఈసారి వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓటమి తర్వాత కూడా అలాంటి భావోద్వేగాలను అధిగమించగలిగానని ఆమె చెప్పింది. చైనాలోని నాన్‌జింగ్‌లో జరిగిన మెగా ఈవెంట్‌లో రజత పతకం సాధించిన అనంతరం సింధు మంగళవారం స్వస్థలం హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. టోర్నీ ఫలితం తదితర అంశాలపై ఆమె ‘సాక్షి’తో మాట్లాడింది. విశేషాలు సింధు మాటల్లోనే... 

మారిన్‌ మళ్లీ దెబ్బ తీయడంపై... 
దాదాపు నెల రోజుల క్రితమే మలేసియా ఓపెన్‌లో మారిన్‌ను ఓడించాను. దాంతో పోలిస్తే ఈసారి ఆమె ఆటలో ఒక్కసారిగా దూకుడు పెరిగింది. నేను ఆటలో దూకుడు గురించి సన్నద్ధమయ్యాను కానీ ఆమె కోర్టులో కూడా కొత్తగా ప్రవర్తించింది. ఆమె శైలి కూడా భిన్నంగా కనిపించింది. నిబంధనల పరిధిలో ఉంటూనే నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రణాళికతోనే ఆమె సిద్ధమై వచ్చిందని కూడా అర్థమైంది. నేను చివరకు అంపైర్లకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది కూడా. అయినా ఫలితం దక్కలేదు. నా ఆటకంటే కూడా ఆమె తన ప్రవర్తనతోనే నాపై ఆధిపత్యం ప్రదర్శించింది. 

మ్యాచ్‌లో ఓటమిపై... 
తొలి గేమ్‌ను చేతులారా కోల్పోవడమే నేను ఫైనల్లో చేసిన తప్పు. దాదాపు 15 పాయింట్ల వరకు కూడా ఇద్దరం సమ ఉజ్జీలుగా ఉన్నాం. కొద్దిసేపు నేను ఏకాగ్రత కోల్పోయి వెనుకబడిపోయాను. గేమ్‌ గెలిచి ఉంటే నాకు మరో అవకాశం ఉండేది. ఇక రెండో గేమ్‌లోనైతే పూర్తిగా షటిల్‌పై నియంత్రణ కోల్పోయాను. ఇతర విషయాలను పక్కన పెడితే మారిన్‌ నిజానికి చాలా బాగా ఆడింది. ఆమెకే గెలిచే అర్హత ఉంది. పైగా చాలా రోజులు గాయాల వల్ల ఆటకు దూరమై ఇటీవల పునరాగమనం చేయడం వల్ల ఒక రకమైన కసి ఆమె ఆటలో కనిపించింది. ఓడినా నా ఆటలో లోపాలేమీ లేవు.  

మళ్లీ ఫైనల్లో ఓడిపోవడంపై... 
చాలా రోజులుగా చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. తుది పోరులో భయపడుతూ ఆడే ‘ఫైనల్‌ ఫోబియా’ అనే పదమే నాకు నచ్చనిది. నేను దానిని నమ్మను. అదే ఉంటే కెరీర్‌లో ఇన్ని విజయాలు దక్కకపోయేవి. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ అనేది మెగా ఈవెంట్‌. నాకు కఠినమైన ‘డ్రా’ ఎదురైంది. టోర్నీలో ముందుకు వెళుతున్నకొద్దీ బలమైన ప్రత్యర్థులు ఎదురవుతారు. దాదాపు అందరూ సమాన స్థాయివారే. అలాంటప్పుడు కొద్ది తేడాలో మ్యాచ్‌ పోతుంది. బరిలోకి దిగినప్పుడు ఎవరైనా 100 శాతం శ్రమిస్తారు. స్వర్ణం గెలిచేందుకే ప్రయత్నిస్తారు. తుది ఫలితం కొంత నిరాశపర్చినా ఈసారి అంతగా బాధ పడిపోలేదు. గత ఏడాది దుబాయ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో ఓడినప్పుడైతే తట్టుకోలేక బాగా ఏడ్చేశాను. ఈసారి అలాంటిదేమీ జరగలేదు. మున్ముందు కూడా కెరీర్‌లో ఇలాంటి క్షణాలు మళ్లీ మళ్లీ ఎదురు కావచ్చు. బాధ పడుతూ కూర్చుంటే ఆడలేం.  

ఓవరాల్‌గా టోర్నీలో ప్రదర్శనపై... 
వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కోసం నేను ఎన్నో విధాలుగా సిద్ధమయ్యాను. ఇతర విషయాల వైపు దృష్టి మళ్లకుండా ఏకాగ్రతతో సాధన చేశాను. చాంపియన్‌ కాగలననే నమ్మకంతోనే వచ్చాను. కానీ అలా జరగలేదు. ఇంకా కష్టపడితే వచ్చేసారి స్వర్ణం గెలవగలనేమో. అయితే సానుకూల దృష్టితో చూస్తే రెండు గొప్ప విజయాలు నాకు అమిత సంతృప్తినిచ్చాయి. క్వార్టర్‌ ఫైనల్లో నొజోమి ఒకుహారా, సెమీస్‌లో అకానె యామగూచిలను సాధికారికంగా ఓడించడం ఆనందం కలిగించింది. వీరిద్దరు గత కొంత కాలంగా సర్క్యూట్‌లో నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. పేరుకు రెండు గేమ్‌ల మ్యాచ్‌లే అయినా వరుస ర్యాలీలతో ఈ మ్యాచ్‌లు కూడా చాలా కఠినంగా, సుదీర్ఘంగా సాగాయి. చివరకు నేనే విజేతగా నిలవగలిగాను. ఫైనల్లో మారిన్‌తో ఓటమి గురించే అంతా మాట్లాడుతున్నారు గానీ ఈ రెండింటిలో నేను అద్భుత ప్రదర్శన కనబర్చగలిగాను.  

వేరేగా ప్రాక్టీస్‌ చేయడంపై... 
నాకు తప్పేమీ అనిపించలేదు. ఇది కూడా ఒకరకంగా నా వ్యూహాల్లో భాగమే. అంతర్జాతీయ టోర్నీల్లో సైనా నెహ్వాల్‌తో ఎన్ని సార్లు తలపడే అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరు కానీ నేను కోచింగ్‌లో కాస్త భిన్నంగా ప్రయత్నిద్దామని భావించా. ఇదే విషయాన్ని గోపీ సర్‌తో చెబితే ఆయన అంగీకరించారు. కోచింగ్‌కు సంబంధించి అన్ని విధాలా సహకారం అందించారు. ఇతర ఇండోనేసియా కోచ్‌లు, ఫిజియోలు... ఇలా అందరూ నాకు సహకరిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ప్రాక్టీస్‌ చేసినా ఇబ్బంది లేదు. ఇక రాబోయే ఆసియా క్రీడలకు సిద్ధమయ్యేందుకు ఎక్కువ సమయం లేదు. అక్కడ కూడా చాలా పోటీ ఉంటుంది. మారిన్‌ తప్ప దాదాపు మిగిలిన టాప్‌ షట్లర్లంతా ఉంటారు. 2014లో మన టీమ్‌ కాంస్యం సాధించింది. ఈసారి వ్యక్తిగతంగా, జట్టుగా కూడా మెరుగైన ఫలితం సాధించాలని పట్టుదలగా ఉన్నాం.  

హండోయో నిష్క్రమణ ప్రభావం... 
ముల్యో హండోయో చాలా అద్భుతమైన కోచ్‌. ఆయన ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చాయి. అందుకు ఆయనకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆయన ఎంతో నేర్పించి వెళ్లారు. ముల్యో నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కారణాలేమైనా ఆయన వెళ్లిపోయారు. అయితే ముల్యో హండోయో లేకపోయినా... ఇప్పటికీ ఆయన నేర్పిన ఎన్నో అంశాలు చాలా సందర్భాల్లో మేం పాటిస్తూనే ఉంటాం.  

మిగతా విజయాలేవీ కనపడవా? 
ఎంతసేపు సింధు ఫైనల్‌ పరాజయాలపైనే స్పందిస్తారా. ఇక్కడ ఆమె సాధించిన సానుకూలాంశాలను చూడండి. ఓ క్రీడాకారిణి రెండు సార్లు ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్‌ పోరుకు అర్హత సాధించడం ఆషామాషీ కాదు. పరిస్థితులు, ఆ రోజు ఆమెకు కలిసిరాలేదంతే! ఫైనల్‌ పరాజయాలు చూసిన వారికి అంతకుముందు రౌండ్లలో ఆమె ప్రపంచ మేటి క్రీడాకారిణిలపై సాధించిన ఘన విజయాలు కనపడవా? క్వార్టర్స్‌లో ఒకుహారాను, సెమీస్‌లో యామగుచిని కంగుతినిపించింది. తుది పోరులో మారిన్‌... సింధు కంటే బాగా ఆడింది. పైగా ఆమె అసాధారణ ఫామ్‌లో ఉంది. ఇకపై మేం ప్రాక్టీస్‌లో మరింత కష్టపడతాం. కోచ్‌గా నాకు ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌ సంతృప్తినే మిగిల్చింది. సైనా కూడా బాగా ఆడింది. ప్రత్యేకించి డబుల్స్‌లో మన షట్లర్లు ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చారు.            
– చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌   

మరిన్ని వార్తలు