క్వార్టర్స్‌లో సింధు 

13 Mar, 2020 04:14 IST|Sakshi

లక్ష్యసేన్‌ ఓటమి

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ 

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లో అడుగు పెట్టింది. గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్‌ పోరులో సింధు 21–19, 21–15తో సుంగ్‌ జి హ్యూన్‌ (దక్షిణ కొరియా)పై వరుస గేముల్లో విజయం సాధించింది. తొలి గేమ్‌లో సింధుకు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. 19–19తో సమానంగా ఉన్న సమయంలో వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ గెలుచుకుంది. పురుషుల విభాగంలో భారత షట్లర్‌ లక్ష్యసేన్‌కు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అతడు 17–21, 18–21తో రెండో సీడ్‌ విక్టర్‌ అక్సెల్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి (భారత్‌) ద్వయం 13–21, 14–21తో మిసాకి మత్సుటోమో–అయాక తకహాషి (జపాన్‌) చేతిలో ఓడింది.

సైనా అవుట్‌ 
భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సైనా 11–21, 8–21తో మూడో సీడ్‌ అకానె యామగుచి (జపాన్‌) చేతిలో ఓడింది. యామగుచి దూకుడు ముందు నిలువలేకపోయిన సైనా... మ్యాచ్‌ను 23 నిమిషాల్లోనే ప్రత్యర్థికి అప్పగించేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల విభాగంలో భారత షట్లర్లు భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్‌లకు కూడా నిరాశే ఎదురైంది. సాయిప్రణీత్‌ 12–21, 13–21తో జావో జున్‌పెంగ్‌ (చైనా) చేతిలో ఓడగా... రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్‌ గాయంతో ఆరంభంలోనే వెనుదిరిగాడు. కేవలం నిమిషం పాటు సాగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌ 0–3తో వెనుకబడిన సమయంలో మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు