శభాష్‌ సింధు...

17 Mar, 2018 03:42 IST|Sakshi

ప్రపంచ చాంపియన్‌ ఒకుహారా పై అద్భుత విజయం

తొలిసారి ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ సెమీఫైనల్లోకి

నేడు అకానె యామగుచితో పోరు

తొలి రెండు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయిన తెలుగు తేజం పీవీ సింధు అసలు సిసలు పోరులో మాత్రం అబ్బురపరిచింది. తన ముందు ప్రపంచ చాంపియన్‌  ప్రత్యర్థిగా ఉన్నా... మ్యాచ్‌లో పలుమార్లు వెనుకబడినా... తన వ్యూహాలకు దీటుగా ప్రత్యర్థి జవాబు ఇస్తున్నా... ఏదశలోనూ తొణకకుండా... విజయంపై ఆశలు వదులుకోకుండా... చివరి పాయింట్‌ వరకు పోరాడిన సింధు ఆఖరికి విజయనాదం చేసి ఔరా అనిపించింది.   

బర్మింగ్‌హామ్‌: కొన్నాళ్లుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై భారత స్టార్‌ పీవీ సింధు మరోసారి పైచేయి సాధించింది. ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో అద్వితీయ విజయంతో తెలుగు తేజం సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 84 నిమిషాలపాటు ఉత్కంఠభరితంగా సాగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 20–22, 21–18, 21–18తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ ఒకుహారాను ఓడించింది.

ఈ మెగా ఈవెంట్‌లో ఆరో ప్రయత్నంలో తొలిసారి సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు సింధు, ఒకుహారా 10 సార్లు తలపడగా... ఇద్దరూ 5–5తో సమఉజ్జీగా ఉన్నారు. ఈ టోర్నీలో సింధు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మూడు గేమ్‌లు ఆడి విజయాన్ని దక్కించుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో అకానె యామగుచి (జపాన్‌)తో సింధు తలపడుతుంది. యామగుచితో ముఖాముఖి రికార్డులో సింధు 6–3తో ఆధిక్యంలో ఉంది.  

గతేడాది ఒకుహారాతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, మరో రెండు ఓడిన సింధు ఈ మ్యాచ్‌లో మాత్రం పట్టుదలతో పోరాడింది. మూడు గేమ్‌లూ నువ్వా నేనా అన్నట్లు సాగాయి. తన ఎత్తు కారణంగా పదునైన స్మాష్‌లు సంధించే వీలున్న సింధుకు ఒకుహారా ఆ అవకాశం ఇవ్వలేదు. ర్యాలీ సుదీర్ఘంగా కొనసాగేలా చూస్తూ అవకాశం దొరకగానే డ్రాప్‌ షాట్‌లు సంధిస్తూ పాయింట్లు రాబట్టింది. సింధు కూడా ఏమాత్రం తీసిపోకుండా ఆడుతూ ఆమె వ్యూహాలకు తగినరీతిలో జవాబిచ్చింది.

దాంతో స్కోరు పలుమార్లు సమమైంది. తొలి గేమ్‌లో స్కోరు 20–20 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు కోల్పోయి గేమ్‌ చేజార్చుకుంది.  మ్యాచ్‌లో నిలవాలంటే తప్పనిసరిగా రెండో గేమ్‌లో నెగ్గాల్సిన స్ధితిలో సింధు ఆరంభంలోనే 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం 6–4తో.. 9–7తో... 11–9తో...14–11, 16–13తో సింధు ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. ఈ దశలో సింధు తప్పిదాలతో స్కోరు 18–18 వద్ద సమమైంది.

కానీ ఈ హైదరాబాద్‌ అమ్మాయి సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి రెండో గేమ్‌ దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు మూడుసార్లు (1–4, 11–14, 12–16)తో వెనుకబడినా... ఒత్తిడి దరిచేరనీయకుండా ఆడింది. 12–16తో వెనుకంజలో ఉన్నపుడు సింధు వరుసగా నాలుగు పాయిం ట్లు గెలిచి స్కోరును 16–16తో సమం చేసింది. అనంతరం ఇద్దరూ రెండేసి పాయింట్లు సాధించడంతో మళ్లీ  18–18 వద్ద  స్కోరు సమమైంది. ఈ దశలో సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా మూడు పాయింట్లు గెలిచి ఒకుహారాను ఇంటిదారి పట్టించింది.


శ్రీకాంత్‌కు నిరాశ
గురువారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 11–21, 21–15, 20–22తో అన్‌సీడెడ్‌ హువాంగ్‌ యుజియాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్‌ 20–18తో విజయానికి చేరువగా వచ్చాడు. అయితే వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయిన ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ ఓటమిని మూటగట్టుకున్నాడు.  

>
మరిన్ని వార్తలు