‘రాకెట్’ తడాఖా

26 Apr, 2014 01:17 IST|Sakshi
‘రాకెట్’ తడాఖా

సెమీస్‌లో పి.వి.సింధు, జ్వాల అశ్విని జోడి
 కనీసం రెండు పతకాలు ఖాయం
 ఏబీసీ చరిత్రలో ఇదే తొలిసారి
 పోరాడి ఓడిన గురుసాయిదత్
 
 భారత బ్యాడ్మింటన్‌లో మరో కొత్త అధ్యాయం. ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో మనోళ్ల రాకెట్ లాంటి ఆటతీరుకు ఒకేసారి రెండు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల సింగిల్స్‌లో యువతార పి.వి.సింధు... మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం సెమీఫైనల్‌కు దూసుకెళ్లి భారత సత్తాను చాటారు. 23 ఏళ్ల ఈ చాంపియన్‌షిప్‌లో చరిత్రలో భారత్‌కు ఒకేసారి రెండు పతకాలు రావడం ఇదే ప్రథమం.
 
 గిమ్‌చియోన్ (కొరియా): నిలకడగా రాణిస్తూ పి.వి.సింధు... తమ పని అయిపోయిందని వస్తున్న విమర్శలకు తగిన సమాధానమిస్తూ గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో ముందంజ వేశారు.
 
  అయితే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గురుసాయిదత్ తీవ్రంగా శ్రమించినా విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 14-21, 21-13, 21-10తో ఒంగ్‌బుమ్‌రంగ్‌పాన్ బుసానన్ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా... డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో జ్వాల-అశ్విని జోడి 21-12, 21-12తో అలిసియా-సూంగ్ ఫీ చో (మలేసియా) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో గురుసాయిదత్ 24-22, 9-21, 13-21తో లియు కాయ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
 
ఏబీసీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్ చేరుకున్న వారికి కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో సింధు... లూ యింగ్లూ యు (చైనా)లతో జ్వాల -అశ్విని తలపడతారు. 1991లో మొదలైన ఏబీసీ లో ఇప్పటివరకు భారత్‌కు రెండు కాంస్యాలు లభించాయి. 2007లో అనూప్ శ్రీధర్... 2010లో సైనా సెమీఫైనల్స్‌లో ఓడిపోయారు.
 
 గతంలో బుసానన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సింధుకు ఈసారి గట్టిపోటీనే లభించింది. మ్యాచ్‌లో కుదురుకునేలోపే సింధు తొలి గేమ్‌ను చేజార్చుకుంది. అయితే వెంటనే తేరుకున్న ఈ తెలుగమ్మాయి రెండో గేమ్‌లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ఇదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. డబుల్స్ మ్యాచ్‌లో జ్వాల జోడి ఏదశలోనూ ప్రత్యర్థి జంటకు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. దూకుడుగా ఆడుతూ 40 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించారు.
 
ఆత్మవిశ్వాసం పెరగడంలో ఈ గొప్ప విజయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ మ్యాచ్‌లో మేమిద్దరం చాలా బాగా ఆడాం. నిలకడగా రాణిస్తే మంచి ఫలితాలు వాటంతటవే వస్తాయని మా ఇద్దరికీ తెలుసు. జోడిగా మరింత ప్రాక్టీస్ చేసి, మరిన్ని మ్యాచ్‌లు ఆడితే పూర్వపు ఫామ్‌ను సాధిస్తాం.    
 అశ్విని పొనప్ప
 
తొలి గేమ్‌లో మినహా సింధు అద్భుతంగా ఆడింది. రెండో గేమ్ నుంచి సింధు స్మాష్‌లలో పదును పెరిగింది. ఈ అంశం విజయంలో కీలకపాత్ర పోషించింది   
గోపీచంద్, కోచ్
 
షిజియాన్ వాంగ్‌తో జరిగే సెమీఫైనల్లో సింధు  ఆమెను ఓడిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. వాంగ్  బలాబలాలు, బలహీనతలపై సింధుకు మంచి అవగాహన ఉంది.    
 రమణ (సింధు తండ్రి)
 
1 భారత్ తరఫున ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ, ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ పతకాలు నెగ్గిన తొలి క్రీడాకారిణులుగా సింధు, జ్వాల, అశ్విని.
 

మరిన్ని వార్తలు