సింధు క్వార్టర్స్‌కు... సైనా ఇంటికి

24 Nov, 2017 04:30 IST|Sakshi

హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ

కౌలూన్‌ (హాంకాంగ్‌): ఈ ఏడాది తన ఖాతాలో మరో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ జమ చేసుకునే దిశగా భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మరో అడుగు ముందుకు వేసింది. సీజన్‌ చివరి సూపర్‌ సిరీస్‌ టోర్నీ హాంకాంగ్‌ ఓపెన్‌లో ఈ తెలుగు తేజం క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–14, 21–17తో అయా ఒహోరి (జపాన్‌)పై గెలిచింది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ఆద్యంతం ఆధిపత్యం చలా యించింది.

తొలి గేమ్‌లో మొదటి రెండు పాయింట్లు ఒహోరి సాధించగా... ఆ వెంటనే సింధు స్కోరును సమం చేసింది. స్కోరు 4–5 వద్ద సింధు వరుసగా ఐదు పాయిం ట్లు గెలిచి 9–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి దాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న సింధు తొలి గేమ్‌ను దక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ మొదటి పాయింట్‌ ఒహోరినే సాధించింది. ఈసారి సింధు వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి ముందంజ వేసింది. అనంతరం సింధు మరింత జోరు పెంచడంతో ఒహోరి తేరుకోలేకపోయింది. ఈ ఏడాది సింధు సయ్యద్‌ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలవడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది.  

మరోవైపు మాజీ చాంపియన్‌ సైనా నెహ్వాల్‌ 21–18, 19–21, 10–21తో ఎనిమిదో సీడ్‌ చెన్‌ యుఫె (చైనా) చేతిలో... పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రణయ్‌ 21–11, 10–21, 15–21తో సకాయ్‌ (జపాన్‌) చేతిలో ఓడిపోయారు. చెన్‌ యుఫెతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 7–10 వద్ద సైనా వరుసగా 10 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. 7–20తో వెనుకబడిన దశలో సైనా వరుసగా మూడు పాయింట్లు గెలిచి, ఆ తర్వాత పాయింట్‌ సమర్పించుకొని ఓడిపోయింది.

మరిన్ని వార్తలు