సింధు టైటిల్ నిలబెట్టుకునేనా!

25 Nov, 2014 00:54 IST|Sakshi

మకావు: హాంకాంగ్ ఓపెన్‌లో నిరాశాజనక ఆటతీరు కనబర్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇప్పుడు కొత్త సవాల్‌కు సిద్ధమైంది. మంగళవారంనుంచి ప్రారంభం కానున్న మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో ఆమె రెండో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీ డిఫెండింగ్ చాంపియన్, ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న సింధు తొలి రౌండ్‌లో హుంగ్ షీ హన్ (చైనీస్ తైపీ)తో తలపడుతుంది.

లక్షా 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ గల ఈ టోర్నీలో భారత్‌నుంచి తొమ్మిది మంది షట్లర్లు బరిలోకి దిగుతున్నారు. మరో భారత క్రీడాకారిణి పీసీ తులసి కూడా చైనీస్ తైపీకే చెందిన సు య చింగ్‌ను మొదటి రౌండ్‌లో ఎదుర్కొంటుంది. పురుషుల విభాగం తొలి రౌండ్‌లో అజయ్ జైరాం... కజుమస సకాయ్ (జపాన్)తో, హెచ్‌ఎస్ ప్రణయ్... షి కు చున్ (చైనీస్ తైపీ)తో పోటీ పడతారు.

యాంగ్ చి చీ (చైనీస్ తైపీ)ని సౌరభ్‌వర్మ ఎదుర్కోనుండగా, అరవింద్ భట్‌కు క్వాలిఫయర్‌తో ఆడే అవకాశం దక్కింది. హైదరాబాద్‌కు చెందిన సాయిప్రణీత్ కూడా ఈ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. వూన్ కాక్ హాంగ్ (మలేసియా)తో ప్రణీత్ మొదటి మ్యాచ్ ఆడతాడు. పురుషుల డబుల్స్‌లో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా జోడి కూడా బరిలో నిలిచింది.

మరిన్ని వార్తలు