‘సూపర్’ టైటిల్‌పై సింధు గురి

18 Oct, 2016 01:09 IST|Sakshi
‘సూపర్’ టైటిల్‌పై సింధు గురి

 ఒడెన్‌‌స (డెన్మార్క్): అందని ద్రాక్షగా ఉన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో భారత స్టార్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగనుంది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతోపాటు మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో చైనా ప్లేయర్ హీ బింగ్‌జియావోతో సింధు ఆడుతుంది.
 
 రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన తర్వాత సింధు ఆడనున్న తొలి టోర్నమెంట్ ఇదే కావడం విశేషం. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సింధు ఈసారి విజేతగా నిలిచి తన ఖాతాలో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను జమ చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ‘రియో ఒలింపిక్స్ ప్రదర్శనతో నాలో చాలా ఆత్మ విశ్వాసం పెరిగింది. అదే ఉత్సాహంతో ఈ టోర్నీలో మెరుగ్గా రాణిస్తానని ఆశిస్తున్నాను. ఇప్పటి నుంచి నాపై మరింత బాధ్యత పెరిగింది.
 
 అరుుతే ఇలాంటి విషయాలను ఆలోచిస్తూ అనవసరంగా ఒత్తిడి పెంచుకోదల్చుకోలేదు. విజయం సాధించేందుకు ఎప్పటిలాగే వందశాతం కృషి చేస్తాను’ అని హీ బింగ్‌జియావోతో ముఖాముఖి రికార్డులో 1-3తో వెనుకంజలో ఉన్న సింధు వ్యాఖ్యానించింది. ‘డ్రా’ రెండో పార్శ్వంలో ఉన్న సింధు తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో సయాకా సాటో (జపాన్)... క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)... సెమీస్‌లో నాలుగో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా) లేదా ఐదో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో ఆడే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి ప్రపంచ నంబర్‌వన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్) ఫైనల్‌కు చేరే అవకాశముంది.
 
 క్వాలిఫయింగ్‌లో కశ్యప్
 పురుషుల సింగిల్స్ విభాగంలో భారత మాజీ నంబర్‌వన్ పారుపల్లి కశ్యప్ క్వాలిఫయింగ్‌లో పోటీపడనున్నాడు. మంగళవారం జరిగే తొలి రౌండ్‌లో అతను రౌల్ మస్ట్ (ఎస్తోనియా)తో ఆడతాడు. ఈ మ్యాచ్ గెలిస్తే రెండో రౌండ్‌లో కశ్యప్‌కు ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్) లేదా ఖోసిట్ (థాయ్‌లాండ్) ఎదురవుతారు. గాయం కారణంగా భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి సాయిప్రణీత్, అజయ్ జయరామ్, ప్రణయ్ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి... మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా బరిలో ఉన్నారు.  
 

మరిన్ని వార్తలు