సెమీస్‌లో చెన్నై స్మాషర్స్‌

11 Jan, 2017 01:43 IST|Sakshi
సెమీస్‌లో చెన్నై స్మాషర్స్‌

ముంబై రాకెట్స్‌పై 4–3తో విజయం  ∙ పీబీఎల్‌–2

బెంగళూరు: వరుసగా రెండో ఏడాది చెన్నై స్మాషర్స్‌ జట్టు ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గత ఏడాది రన్నరప్‌ ముంబై రాకెట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్‌ 4–3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్‌ (చెన్నై) 9–11, 11–13తో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (ముంబై) చేతిలో ఓడిపోయాడు. అయితే ‘ట్రంప్‌’ మ్యాచ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్రిస్‌ అడ్‌కాక్‌–గాబ్రియెలా అడ్‌కాక్‌ ద్వయం (చెన్నై) 9–11, 11–2, 11–7తో చిరాగ్‌ శెట్టి–జీబా నాదెజ్దా (ముంబై) జోడీపై గెలిచింది. దాంతో చెన్నై 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. పురుషుల సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లో టామీ సుగియార్తో (చెన్నై) 8–11, 11–2, 11–5తో అజయ్‌ జయరామ్‌ (ముంబై)ను ఓడించడంతో చెన్నై 3–1తో ముందంజ వేసింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (చెన్నై) 11–8, 12–10తో సుంగ్‌ జీ హున్‌ (ముంబై)పై నెగ్గడంతో చెన్నై 4–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. పురుషుల డబుల్స్‌ ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో యోంగ్‌ డే లీ–నిపిత్‌పోన్‌ (ముంబై) జంట 11–3, 11–5తో క్రిస్‌ అడ్‌కాక్‌–కోల్డింగ్‌ (చెన్నై) జోడీని ఓడించినా... తుదకు 3–4తో ఓటమిని ఖాయం చేసుకుంది.

సింధు, సైనా పోరు జరిగేనా?
బుధవారం జరిగే మ్యాచ్‌లో అవధ్‌ వారియర్స్‌ తో చెన్నై స్మాషర్స్‌ ఆడుతుంది. అయితే ఇప్పటికే సెమీఫైనల్‌ బెర్త్‌లను ఖాయం చేసుకున్న వారియర్స్‌ తరఫున సైనా... చెన్నై స్మాషర్స్‌ తరఫున పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో ముఖాముఖిగా తలపడతారో... లేక ఇద్దరూ విశ్రాంతి తీసుకొని అరుంధతి (చెన్నై), రితూపర్ణ దాస్‌ (వారియర్స్‌)లను మహిళల సింగిల్స్‌ బరిలోకి దించుతారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు