పీవీ సింధు కోచ్‌ రాజీనామా

24 Sep, 2019 11:15 IST|Sakshi

న్యూఢిలీ: ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను భారత షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు గెలవడంలో కీలక పాత్ర పోషించిన  దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్‌ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. భారత మహిళల సింగిల్స్‌ కోచ్‌గా నాలుగు నెలలు మాత్రమే సేవలందించిన హ్యుస్‌ వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతలను నుంచి తప్పుకున్నారు. గత నాలుగు నెలలుగా ఆమె పీవీ సింధుకు శిక్షణ ఇచ్చారు. వరల్డ్ నంబర్ 5 బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఉన్న సింధు వరల్డ్ ఛాంపియన్‌గా మారడంలో హ్యున్ ముఖ్య భూమిక పోషించారు.

హ్యున్ భర్త కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయనకు సర్జరీ కావడంతో ఆరు నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ ఆరు నెలల పాటు భర్తను చూసుకునేందుకు హ్యున్ వెళ్లారు. ఆమె మళ్లీ వచ్చే అవకాశం లేనట్లు తెలిసింది.  దాంతోనే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పీవీ సింధు ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించినా.. ఈ సీజన్‌లో వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. చైనా ఓపెన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన సింధు.. రెండో రౌండ్‌లోనే ఓడి తీవ్రంగా నిరాశపరిచింది. అయితే, ఈ పరాజయం నుంచి వెంటనే కోలుకుని.. మంగళవారం నుంచి జరిగే కొరియా ఓపెన్‌లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.

మరిన్ని వార్తలు