ఈ ప్రయాణం బహు భారం! 

16 Mar, 2020 02:51 IST|Sakshi

దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు వెతలు  

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా జట్టు రెండో వన్డే ఆడేందుకు శుక్రవారమే లక్నో చేరుకుంది. ఆ తర్వాతే సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. నిజానికి స్వదేశం వెళ్లాలంటే అత్యంత సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీకి వెళ్లి అటు నుంచి సఫారీ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా బయల్దేరాలి. లేదంటే ఎక్కువ విమానాలు అందుబాటులో ఉన్న ముంబై నుంచి కానీ వెళ్లాలి. అయితే అలా జరగలేదు. ఢిల్లీ, ముంబైలలో కరోనా వైరస్‌ విస్తరిస్తోందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో డి కాక్‌ బృందం దేశ రాజధాని వెళ్లడానికి నిరాకరించింది. ప్రస్తుతం దేశంలో ఒక్క కోవిడ్‌–19 కేసు కూడా నమోదు కాని సురక్షిత నగరానికి ముందు తమను తీసుకెళ్లమని కోరింది! అప్పటి వరకు జట్టు సభ్యులంతా హోటల్‌ గదుల నుంచి బయటకు రాకుండా లక్నోలోనే ఉండిపోయారు. దాంతో అధికారులు అన్నీ చూసి కోల్‌కతాను అందు కోసం ఎంపిక చేశారు. ఇప్పుడు వారు సోమవారం కోల్‌కతాకు వెళ్లి మరుసటి రోజు దుబాయ్‌ మీదుగా స్వదేశానికి బయల్దేరతారు. దక్షిణాఫ్రికా క్రికెటర్లను పంపించేందుకు ప్రభుత్వ సహాయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియా వెల్లడించారు. ‘విమానాశ్రయానికి దగ్గరలోనే వారి బస ఏర్పాటు చేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా ఈ విషయంపై చర్చించాం. వారు మా అతిథులు. అన్ని రకాలుగా సహకరించి దక్షిణాఫ్రికా జట్టును వారి దేశానికి పంపిస్తాం’ అని ఆయన చెప్పారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు