నాదల్‌ నిర్దాక్షిణ్యంగా...

25 Jan, 2019 02:33 IST|Sakshi

ఫైనల్‌ చేరిన స్పెయిన్‌ బుల్‌  

సెమీస్‌లో సిట్సిపాస్‌పై ఘన విజయం 

తుది పోరుకు క్విటోవా, ఒసాకా 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌  

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్స్‌లో రోజర్‌ ఫెడరర్‌నే చిత్తు చేసి సంచలనం సృష్టించిన గ్రీకు వీరుడు సిట్సిపాస్‌ ఆటలు స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ముందు సాగలేదు. ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో సిట్సిపాస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తూ నాదల్‌ చెలరేగాడు. నిర్దాక్షిణ్యమైన ఆటతో విజయాన్ని అందుకొని పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ వేటలో నిలిచాడు.

టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క సెట్‌ కూడా కోల్పోని నాదల్‌ భీకర ఫామ్‌ ముందు సిట్సిపాస్‌ పూర్తిగా చేతులెత్తేశాడు. మహిళల విభాగంలో పెట్రా క్విటోవా, నయోమి ఒసాకా ఫైనల్‌ చేరి ఆఖరి సమరానికి సిద్ధమయ్యారు. వీరిద్దరిలో ఎవరి గెలిస్తే వారు హలెప్‌ స్థానంలో కొత్త వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలుస్తారు.  

మెల్‌బోర్న్‌:  కెరీర్‌లో ఒకే ఒక్క సారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) మరో టైటిల్‌ విజయానికి మరింత చేరువయ్యాడు. నాలుగు సార్లు ఈ టోర్నీ ఫైనల్లో ఓడిన అతను... మళ్లీ ఇక్కడ విజయం సాధించగలిగితే ఓపెన్‌ ఎరాలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను కనీసం రెండేసి సార్లు నెగ్గిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. నాదల్‌ అద్భుత ఫామ్‌ను చూపించేలా సెమీ ఫైనల్‌ సాగింది. ఈ మ్యాచ్‌లో అతను 6–2, 6–4, 6–0తో స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను చిత్తుగా ఓడించాడు. 1 గంటా 46 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ఆద్యంతం రాఫెల్‌ దూకుడు కొనసాగింది.

ఫైనల్‌ చేరే క్రమంలో వరుసగా 63 గేమ్‌లలో నాదల్‌ తన సర్వీస్‌ను కోల్పోకపోవడం విశేషం.  తొలి సెట్‌ మూడో గేమ్‌లో సిట్సిపాస్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తన ధాటిని మొదలు పెట్టిన నాదల్‌ ఏ దశలోనూ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. పదునైన సర్వీస్‌లతో దూసుకుపోయిన అతను 4–2తో ముందంజ వేశాడు. రెండు డబుల్‌ ఫాల్ట్‌లతో పాటు పేలవ డ్రాప్‌షాట్‌లతో సిట్సిపాస్‌ తొలి సెట్‌లో పూర్తిగా వెనుకబడిపోయాడు. రెండో సెట్‌లో మాత్రం కొంత పోటీనిచ్చిన గ్రీక్‌ ఆటగాడు 4–4 వరకు సమంగా నిలిచాడు. అయితే బ్రేక్‌ సాధించిన నాదల్‌ తన సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు.

మూడో సెట్‌లోనైతే తిరుగులేని ఆటతో మూడు సార్లు సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నాదల్‌... ప్రత్యర్థికి ఒక్క గేమ్‌ కూడా ఇవ్వలేదు. నాదల్‌ 28 విన్నర్లు కొట్టగా, సిట్సిపాస్‌ 17కే పరిమితం కావడం ఇద్దరి ఆట మధ్య తేడాను చూపిస్తోంది.  ఈ టోర్నీలో హోరాహోరీ మ్యాచ్‌లు ఆడటంతో నాదల్‌తో పోలిస్తే దాదాపు పది గంటలు ఎక్కువగా కోర్టులో గడిపిన సిట్సిపాస్‌పై తీవ్ర అలసట కూడా ప్రభావం చూపించింది.

తొలిసారి ఫైనల్‌కు... 
మహిళల విభాగంలో ఎనిమిదో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) కెరీర్‌లో మొదటి సారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సెమీస్‌లో క్విటోవా 7–6 (7/2), 6–0తో డానియెల్‌ కొలిన్స్‌ను చిత్తు చేసింది. 1 గంటా 34 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. తొలి సెట్‌ ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగింది. 4–4తో స్కోరు సమంగా నిలిచిన స్థితిలో ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిపోవడంతో రాడ్‌ లేవర్‌ ఎరీనా పై కప్పును మూసేశారు. తిరిగొచ్చిన తర్వాత కొలిన్స్‌ ఆట గతి తప్పింది. సహనం కోల్పోయిన ఆమె రెండో సెట్‌కు ముందు అంపైర్‌తో కూడా వాదనకు దిగింది. రెండో సెట్‌లో క్విటోవాకు ఎదురు లేకుండా పోయింది.

రెండు సార్లు వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన క్విటోవా 2016లో కత్తిపోటుకు గురైంది. పునరాగమనం తర్వాత ఆమె అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. మరో సెమీస్‌లో నాలుగో సీడ్, యూఎస్‌ ఓపెన్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ నయోమి ఒసాకా (జపాన్‌) 6–2, 4–6, 6–4తో ఏడో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను చిత్తు చేసింది. క్వార్టర్స్‌లో సెరెనాను కంగు తినిపించిన ప్లిస్కోవా గట్టిగా పోరాడినా జపాన్‌ స్టార్‌ ముందు తలవంచక తప్పలేదు.  

మరిన్ని వార్తలు