రసవత్తరంగా యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌

9 Sep, 2019 09:18 IST|Sakshi
మ్యాచ్‌ అనంతరం రాఫెల్‌ నాదల్‌ (న్యూయార్క్‌ టైమ్స్‌ ఫొటో)

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను స్పెయిల్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ గెల్చుకున్నాడు. హోరా హోరీగా జరిగిన తుది పోరులో ఐదో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో ఓడించి విజేతగా నిలిచాడు. ఈ విజయంతో కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ రికార్డుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు.

తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అడుగు పెట్టిన మెద్వెదేవ్‌ అంత సులువుగా తలవంచలేదు. మొదటి రెండు సెట్‌లు రాఫెల్‌ గెలిచినప్పటికీ మెద్వెదేవ్‌ కుంగిపోకుండా మొండి ధైర్యంతో పోరాడు. మూడు, నాలుగు సెట్లను దక్కించుకుని నాదల్‌కు చెమటలు పట్టించాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో రాఫెల్‌ విజృంభించడంతో మెద్వెదేవ్‌ ఓటమి పాలయ్యాడు. నాలుగు గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ క్రీడాభిమానులను ఆకట్టుకుంది. చాంపియన్‌ రాఫెల్‌కు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్‌ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిట్స్‌తో రోజర్‌ ఫెదరర్‌.. నాదల్‌ కంటే ముందున్నాడు. మరో టైటిల్‌ సాధిస్తే ఫెదరర్ రికార్డును నాదల్‌ సమం చేస్తాడు.

రికార్డు బ్రేక్‌
30 ఏట అడుగుపెట్టిన తర్వాత ఐదు మేజర్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా రాఫెల్‌ నాదల్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఫెడరర్‌, నొవాక్‌ జకోవిచ్‌, రొడ్‌ లావెర్‌, కెన్‌ రోజ్‌వాల్‌ పేరిట ఉన్న రికార్డును నాదల్‌ బద్దలు కొట్టాడు. వీరంతా 30 ఏళ్లు దాటిన తర్వాత నాలుగేసి టైటిళ్లు సాధించారు. 33 ఏళ్ల నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. గతంలో మూడుసార్లు (2017, 2013, 2010) విజేతగా నిలిచిన అతడు ఒకసారి రన్నరప్‌ (2011)తో సరిపెట్టుకున్నాడు. కెరీర్‌లో 27వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌ ఆడిన రాఫెల్‌ 19 ఫైనల్స్‌లో గెలిచి, 8 ఫైనల్స్‌లో ఓడిపోయాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Poll
Loading...
మరిన్ని వార్తలు