నాదల్‌ శ్రమించి...

22 Jan, 2018 03:58 IST|Sakshi

క్వార్టర్‌ ఫైనల్లోకి స్పెయిన్‌ స్టార్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ

మొదటి మూడు రౌండ్‌లలో సునాయాస విజయాలు సాధించిన ప్రపంచ నంబర్‌వన్‌ రాఫెల్‌ నాదల్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తొలిసారి అసలు పరీక్ష ఎదురైంది. అర్జెంటీనా యువతార డీగో ష్వార్ట్‌జ్‌మన్‌తో దాదాపు నాలుగు గంటలపాటు సాగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఈ స్పెయిన్‌ స్టార్‌ తన అనుభవాన్నంతా రంగరించి గట్టెక్కాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌తో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ కరోలిన్‌ వొజ్నియాకి, నాలుగో సీడ్‌ స్వితోలినా అలవోక విజయాలతో క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టారు.   

మెల్‌బోర్న్‌: గతేడాది రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించి జోరు మీదున్న స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ కొత్త సీజన్‌లోనూ దూసుకెళ్తున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీలో ఈ టాప్‌ సీడ్‌ ప్లేయర్‌ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. 24వ సీడ్‌ డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెం టీనా)తో 3 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ నాదల్‌ 6–2, 6–7 (4/7), 6–3, 6–3తో గెలుపొంది పదోసారి ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ దశకు అర్హత సాధించాడు.

గతేడాది రన్నరప్‌గా నిలిచిన నాదల్‌ తాజా విజయంతో తన నంబర్‌వన్‌ ర్యాంక్‌ను పదిలం చేసుకున్నాడు. ‘మ్యాచ్‌ గొప్పగా సాగింది. ఒకదశలో అలసిపోయినా తుదివరకు పోరాడగలిగి విజయం దక్కించుకున్నాను’ అని నాదల్‌ వ్యాఖ్యానిం చాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఒక్క సెట్‌ కూడా కోల్పోని నాదల్‌ ఈ పోటీలో ఒక సెట్‌ చేజార్చుకున్నాడు. అంతేకాకుండా తన సర్వీస్‌ మూడుసార్లు కోల్పోయాడు. మరోవైపు ష్వార్ట్‌జ్‌మన్‌ 12 ఏస్‌లు సంధించడంతోపాటు శక్తివంతమైన గ్రౌండ్‌షాట్‌లతో నాదల్‌ను ఇబ్బంది పెట్టాడు.

క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)తో నాదల్‌ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిలిచ్‌ 6–7 (2/7), 6–3, 7–6 (7/0), 7–6 (7/3)తో పదో సీడ్‌ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్‌)ను ఓడించాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో మూడో సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) 7–6 (7/3), 7–6 (7/4), 4–6, 7–6 (7/4)తో 17వ సీడ్‌ నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొంది మూడోసారి ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... బ్రిటన్‌ ఆశాకిరణం కైల్‌ ఎడ్మండ్‌ 6–7 (4/7), 7–5, 6–2, 6–3తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)ని ఓడించి కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు.  

స్వితోలినా తొలిసారి...
మహిళల సింగిల్స్‌లో ఆదివారం ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదు. రెండో సీడ్‌ కరోలిన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌) ఐదేళ్ల తర్వాత, నాలుగో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు ఖాయం చేసుకున్నారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వొజ్నియాకి 6–3, 6–0తో 19వ సీడ్‌ మగ్ధలినా రిబరికోవా (స్లొవేకియా)పై... స్వితోలినా 6–3, 6–0తో డెనిసా అలెర్టోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచారు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కార్లా సురెజ్‌ నవారో (స్పెయిన్‌) 4–6, 6–4, 8–6తో 32వ సీడ్‌ కొంటావీట్‌ (ఎస్తోనియా)పై, ఎలీస్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం) 7–6 (7/5), 7–5తో పెట్రా మార్టిక్‌ (క్రొయేషియా)పై విజయం సాధించారు.  

పేస్‌ జంట నిష్క్రమణ
పురుషుల డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌–పురవ్‌ రాజా (భారత్‌) జంట పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పేస్‌–పురవ్‌ ద్వయం 1–6, 2–6తో సెబాస్టియన్‌ కబాల్‌–రాబర్ట్‌ ఫరా (కొలంబియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–తిమియా బాబోస్‌ (హంగేరి) జోడీ 6–2, 6–4తో విటింగ్టన్‌–ఎలెన్‌ పెరెజ్‌ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచింది.  

నన్ను అనుసరించాలని కోరుకోవట్లేదు!
► తన పిల్లల గురించి ఫెడరర్‌   
మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో అతను ఒకడు... 19 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల విజేత... సహజంగానే అతని పిల్లలు తండ్రి అడుగు జాడల్లో నడుస్తారని, భవిష్యత్తులో టెన్నిస్‌ స్టార్‌లుగా ఎదుగుతారని చాలా మంది భావిస్తారు. అయితే రోజర్‌ ఫెడరర్‌ మాత్రం అలా జరగాలని కోరుకోవట్లేదు. ఏదైనా ఆటలో ప్రవేశం ఉంటే మంచిదే కానీ తనలాగా ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆటగాళ్లుగా మారతారో లేదో చెప్పలేనన్నాడు. ‘వారు నన్ను అనుసరించాలని ఆశించడం లేదు.

ఎందుకంటే నా పిల్లలు కూడా మరో 25 ఏళ్ల పాటు ప్రొఫెషనల్‌గా మారి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూనే ఉండాలని నేను కోరుకోకపోవడమే దానికి కారణం. అయితే ఆటలు కానీ వ్యాపారంలాంటి మరో రంగంలోకి కానీ వారు వెళతానంటే మద్దతుగా నిలుస్తాను. చిన్నప్పుడే ఆటలు ఆడే మంచి అలవాటు వారికి రావాలి. అది ఏ ఆటైనా సరే. అయినా సరదాగానైనా ఫెడరర్‌ పిల్లలు టెన్నిస్‌ ఆడకుంటే ఆశ్చర్యం కానీ ఆడితే ఏముంది’ అని ఈ దిగ్గజ ఆటగాడు వ్యాఖ్యానించాడు. ఫెడరర్, మిర్కా దంపతులకు కవలల జతలు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.   

మరిన్ని వార్తలు