వేచి చూద్దాం!

6 Jun, 2020 02:47 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌లో ఆడేది అనుమానమే

ప్రస్తుత పరిస్థితుల్లో న్యూయార్క్‌కు వెళ్లలేను

డిఫెండింగ్‌ చాంపియన్‌ నాదల్‌ వ్యాఖ్య

బార్సిలోనా (స్పెయిన్‌): కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో... అమెరికాలోని న్యూయార్క్‌నగరం వేదికగా జరగాల్సిన యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తాను పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయని స్పెయిన్‌ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ రాఫెల్‌ నాదల్‌ వెల్లడించాడు. ‘న్యూయార్క్‌లో జరిగే టెన్నిస్‌ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికిప్పుడు అమెరికాకు వెళ్తావా అని ఎవరైనా నన్ను అడిగితే... వెళ్లలేను అని సమాధానం చెబుతాను. అయితే రెండు నెలల తర్వాత న్యూయార్క్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేను. మెరుగవుతాయనే ఆశిస్తున్నాను. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్‌ ఒకటి. ముందైతే యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ నిర్వాహకుల నుంచి స్పష్టమైన ప్రకటన రానివ్వండి. అప్పటి వరకు వేచి చూద్దాం’ అని యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఉన్న నాదల్‌ తెలిపాడు.

నాదల్‌ మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధిస్తే... పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ (20 టైటిల్స్‌)ను సమం చేస్తాడు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు జరగాల్సి ఉంది. కరోనా కారణంగా టెన్నిస్‌ టోర్నీలపై తీవ్ర ప్రభావమే పడింది. మార్చి రెండో వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ టోర్నీలు ఆగిపోయాయి. కరోనా దెబ్బకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని రద్దు చేశారు. మే–జూన్‌లలో జరగాల్సిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని సెప్టెంబర్‌ చివరి వారానికి వాయిదా వేశారు.

‘ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, సురక్షితంగా యూఎస్‌ ఓపెన్‌ జరిగేలా నిర్వాహకులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఒకవేళ అలా చేయకుంటే అందులో అర్థం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రేక్షకులు లేకుండా ఆడాల్సి వస్తే దానికి సిద్ధమే. అయితే రాబోయే రెండు నెలల్లో పరిస్థితులు మెరుగుపడి ప్రేక్షకుల సమక్షంలోనే యూఎస్‌ ఓపెన్‌ జరగాలని ఆశిస్తున్నాను’ అని ఈ మాజీ నంబర్‌వన్‌ వ్యాఖ్యానించాడు. రెండు వారాల వ్యవధిలో యూఎస్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ జరగనున్నందున... రెండింటిలోనూ తాను ఆడే విషయంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనన్నాడు. అంతర్జాతీయంగా అన్ని దేశాల్లోనూ ప్రయాణ ఆంక్షలు ఎత్తివేశాకే టెన్నిస్‌ టోర్నీలు నిర్వహిస్తే బాగుంటుందని నాదల్‌ అభిప్రాయపడ్డాడు. 

మరిన్ని వార్తలు