నాదల్ ‘నవ’ నాదం

9 Jun, 2014 16:11 IST|Sakshi
నాదల్ ‘నవ’ నాదం

తొమ్మిదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం
ఫైనల్లో జొకోవిచ్‌పై ఘన విజయం
14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సంప్రాస్ సరసన స్థానం

 
అదే కోర్టు... అదే మట్టి...అతడే విజేత ఎరుపురంగు కనిపిస్తే స్పెయిన్ బుల్ రంకెలేస్తుంది... ఎర్ర మట్టి కనిపిస్తే ఈ స్పానిష్ స్టార్ ఆట పదునెక్కుతుంది. క్యాలెండర్‌లో సంవత్సరాల అంకెలు మారుతున్నాయి. కానీ ఆ గడ్డపై ఫలితం మాత్రం మారడం లేదు. ప్రత్యర్థి ఎవరైనా ఆ జోరు ముందు తలవంచాల్సిందే. ఎంత మంది అక్కడ దండయాత్రకు వచ్చినా అది ఫైనల్ వరకే. నాదల్ ఫైనల్‌కు వచ్చాడంటే ప్రత్యర్థి రన్నరప్ ట్రోఫీని అందుకున్నామన్న అల్పానందంతో వెనుదిరగాల్సిందే.
 
 రోలండ్ గారోస్‌లోని క్లే కోర్టును తన సొంత అడ్డాగా మార్చుకున్న రాఫెల్ నాదల్ మరోసారి ఆ గడ్డపై తన దూకుడు ప్రదర్శించాడు. తనకు అచ్చొచ్చిన చోట వరుసగా ఐదో ఫ్రెంచ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రికార్డు విజయంతో చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. మరోవైపు ప్రస్తుత ఫామ్‌తో అద్భుతాన్ని ఆశించిన ‘జోకర్’ నొవాక్ జొకోవిచ్‌కు మళ్లీ ‘ఫ్రెంచ్ ఓపెన్’ అందని ద్రాక్షే అయింది.
 
 పారిస్: ఊహించిన ఫలితమే వచ్చింది. స్పెయిన్ స్టార్,ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ కింగ్‌గా నిలిచాడు. ఆదివారం రోలండ్ గారోస్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నాదల్ 3-6, 7-5, 6-2, 6-4తో ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై ఘన విజయం సాధించాడు. తొలి సెట్ నెగ్గి జొకోవిచ్ కాస్త ఆధిక్యం ప్రదర్శించినట్లు కనిపించినా... 3 గంటల 31 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో చివరకు నాదల్‌దే పైచేయి అయింది. ఫ్రెంచ్ ఓపెన్‌ను నాదల్ గెలవడం ఇది 9వ సారి కాగా... వరుసగా ఐదో సారి (2010-2014) కావడం విశేషం. ఈ టైటిల్‌తో అతను అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. 14 టైటిల్స్‌తో పీట్ సంప్రాస్ (అమెరికా)సరసన నాదల్ ఉన్నాడు. 17 టైటిల్స్‌తో ఈ జాబితాలో ఫెడరర్ (స్విట్జర్లాండ్) అగ్రస్థానంలో ఉన్నాడు.

శుభారంభం

మ్యాచ్ ఆరంభం నుంచి నాదల్, జొకోవిచ్ ఎక్కువగా బేస్‌లైన్ వద్దనుంచే పోటీ పడ్డారు. ఇందులో జొకోవిచ్ స్వల్ప ఆధిక్యం కనబర్చారు. ఇద్దరు ఆటగాళ్లు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో జొకోవిచ్ 4-3తో ముందంజలో నిలిచాడు.
 
అయితే ఈ దశలో తొలిసారి నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని జొకోవిచ్ వృథా చేయలేదు. నాదల్ కొట్టిన రెండు ఫోర్‌హ్యాండ్ షాట్‌లు లైన్ బయట పడగా... జొకోవిచ్ తన పదునైన బ్యాక్‌హ్యాండ్ పాయింట్ సాధించి 5-3తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత తన గేమ్‌ను నిలబెట్టుకున్న జొకోవిచ్ 44 నిమిషాల్లో సెట్‌ను ముగించాడు.
 
కోలుకున్న నాదల్

రెండో సెట్‌లో మాత్రం వరల్డ్ నంబర్‌వన్ తనదైన దూకుడు ప్రదర్శించాడు. వరుసగా రెండు సార్లు బ్రేక్ పాయింట్లు సాధించి 4-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే కోలుకున్న జొకోవిచ్ 4-4తో, ఆ తర్వాత 5-5తో సమం చేశాడు. 17 విన్నర్లు సంధించిన స్పెయిన్ స్టార్ ఒత్తిడిని అధిగమించి 60 నిమిషాల్లో రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు.
 
అలవోకగా

మూడో సెట్‌లో మాత్రం ఎర్ర మట్టి స్పెషలిస్ట్ చెలరేగిపోయాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నాదల్ 3-0తో ముందంజ వేశాడు. ఈ క్రమంలో వరుసగా ఐదు గేమ్‌లు కోల్పోయిన జొకోవిచ్ ఆ తర్వాత  రెండుసార్లు తన సర్వీస్‌ను నిలబెట్టుకున్నా లాభం లేకపోయింది. నాదల్ ఫోర్‌హ్యాండ్ షాట్ల ముందు సెర్బియా ఆటగాడు తేలిపోయాడు. ఫలితంగా 50 నిమిషాల్లో సెట్ గెలిచిన నాదల్‌కు మ్యాచ్‌లో ఆధిక్యం దక్కింది.
 
అదే జోరు

రికార్డు విజయం కోసం నాలుగో సెట్ బరిలోకి దిగిన స్పెయిన్ బుల్ అదే ఉత్సాహంతో ఆడాడు. తన మూడు గేమ్‌లను గెలుచుకోవడంతో పాటు మరో సారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ దశలో అలసిపోయిన జొకోవిచ్ కోలుకోవడం కష్టమే అనిపించింది.
 
అయితే నాదల్ పొరపాట్లతో ఏడో గేమ్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన గేమ్‌ను కూడా నిలబెట్టుకొని 4-4తో స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత అద్భుతమైన ఫోర్‌హ్యాండ్  షాట్లు ఆడిన నాదల్ 5-4తో ముందంజ వేశాడు. చివరి గేమ్‌లో 30-30తో ఉన్న దశలో నాదల్ కొట్టిన క్రాస్ కోర్ట్ బ్యాక్ హ్యాండ్ విన్నర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. సర్వీస్ చేస్తూ జొకోవిచ్ డబుల్ ఫాల్ట్ చేయడంతో ఎర్రమట్టి కోర్టుపై మరోసారి నాదల్ విజయ నాదం మోగింది.
 

టెన్నిస్ చరిత్రలో వరుసగా పదో ఏడాది ఏదో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి క్రీడాకారుడిగా నాదల్ చరిత్ర సృష్టించాడు. తొమ్మిదిసార్లు (2005 నుంచి 2008 వరకు; 2010 నుంచి 2014 వరకు) ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన నాదల్... 2008, 2010లలో వింబుల్డన్... 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్; 2010, 2013లలో యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు.ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇప్పటివరకు జొకోవిచ్‌తో ఆడిన ఆరుసార్లూ నాదల్‌నే విజయం వరించింది.
 
నాదల్ ఆడిన 9 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఒక్కటీ ఐదు సెట్‌లపాటు జరగకపోవడం విశేషం. మూడు ఫైనల్స్‌ను మూడు సెట్‌లలో... ఆరు ఫైనల్స్‌ను నాలుగు సెట్‌లలో ముగించాడు.విజేతగా నిలిచిన నాదల్‌కు 16 లక్షల 50 వేల యూరోలు (రూ. 13 కోట్ల 29 లక్షలు); రన్నరప్ జొకోవిచ్‌కు 8 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
 
 ‘‘ఇది అద్భుతమైన, ఉద్విగ్నభరితమైన విజయం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వెన్నునొప్పి కారణంగా కోల్పోయిన దానిని ఇక్కడ సాధించగలిగాను. రోలండ్ గారోస్‌లో ఆడటం ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. జొకోవిచ్‌తో తలపడటం ఎప్పుడూ నాకు సవాలే. అతడు కూడా ఏదో ఒకరోజు  ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుస్తాడు.’’   
 - నాదల్
 

మరిన్ని వార్తలు