యూఎస్‌ ఓపెన్ విజేత నాదల్‌

11 Sep, 2017 08:38 IST|Sakshi
యూఎస్‌ ఓపెన్ విజేత నాదల్‌

న్యూయార్క్‌: స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాడు. మూడోసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచి ఈ మైలురాయిని అందుకున్నాడు. యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో నాదల్‌ విజృంభించి ఆడి వరుస సెట్లలో విజయం సాధించాడు. 6-3, 6-3, 6-4 తేడాతో కెవిన్‌ అండర్సన్‌ను చిత్తుగా ఓడించాడు.

ఈ ఏడాది నాదల్‌ మూడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరిన రాఫెల్‌ స్థాయికి తగిన ఆటతీరుతో అండర్సన్‌ను బెంబేలెత్తించాడు. 1968 తర్వాత యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన తొలి దక్షిణాఫ్రికా క్రీడాకారుడిగా నిలిచిన అండర్సన్‌ రన్నరప్‌గానే మిగిలాడు. విజేతగా నిలిచిన నాదల్‌కు 37 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 61 లక్షలు)... రన్నరప్‌ అండర్సన్‌కు 18 లక్షల 25 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఈ ఏడాదిలో రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలవడం పట్ల నాదల్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ ఏడాదిలో ఇలా జరగడం నమ్మశక్యంగా లేదు. వ్యక్తిగత సమస్యలు, గాయాలు కారణంగా కొన్నేళ్లుగా బాగా ఆడలేకపోయాను. ఈ సీజన్‌లో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాన’ని మ్యాచ్‌ ముగిసిన తర్వాత నాదల్‌ వ్యాఖ్యానించాడు.

ఫెడరర్‌ ఫస్ట్‌.. నాదల్‌ సెకండ్‌
పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్ సాధించిన వారిలో రోజర్‌ ఫెడరర్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 19 టైటిల్స్‌ సాధించగా, నాదల్‌ ఖాతాలో 16 టైటిల్స్‌ ఉన్నాయి. పీట్‌ సంప్రాస్‌(14), జొకొవిక్‌(12), ఎమర్సన్‌(12), బొర్గ్‌(11), లావర్‌(11), టిల్డన్‌(10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. నాదల్‌ అత్యధికంగా 10 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ సొంతం చేసుకున్నాడు. మూడు యూఎస్‌ ఓపెన్‌, రెండు వింబుల్డన్‌ టైటిల్స్‌ అందుకున్నాడు. ఒకసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేతగా నిలిచాడు.

మరిన్ని వార్తలు