రహానే, పుజారా జోరు.. లంక బేజారు

3 Aug, 2017 19:49 IST|Sakshi
రహానే, పుజారా జోరు.. లంక బేజారు

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత బ్యాట్స్‌మెన్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు సెంచరీలతో చెలరేగారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి భారీ దిశగా సాగుతోంది. వైరల్ ఫీవర్ కారణంగా తొలి టెస్టు ఆడని ఓపెనర్ లోకేశ్ రాహుల్ (92 బంతుల్లో 57: 7ఫోర్లు) కొలంబో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (37 బంతుల్లో 35: 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడే క్రమంలో పెరీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం లభించింది.

లంక కెప్టెన్ చండీమల్ మెరుపు ఫీల్డింగ్‌తో రాహుల్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ కోహ్లీ(13) త్వరగా పెవిలియన్ బాటపట్టాడు. కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకొచ్చిన రహానేతో కలిసి పుజారా ఇన్నింగ్స్ నిర్మించాడు. తొలిటెస్టులో సెంచరీ చేసిన పుజరా కొలంబో టెస్టులోనూ ఇన్నింగ్స్‌కు గోడలా నిలిచాడు. చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ బ్యాటింగ్ కొనసాగించిన పుజారా 164 బంతుల్లో శతకం పూర్తిచేశాడు. పుజారా (225 బంతుల్లో 128 నాటౌట్: 10 ఫోర్లు, 1 సిక్స్) కు ఇది 13వ టెస్టు సెంచరీ. అనంతరం రహానే (168 బంతుల్లో 103 నాటౌట్: 12 ఫోర్లు) సెంచరీ సాధించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు అజేయంగా డబుల్ సెంచరీ (211) భాగస్వామ్యాన్ని అందించడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఈ జంటను విడతీసేందుకు లంక బౌలర్లు ఎంతగానో శ్రమించినా ఫలితం దక్కలేదు. తొలిరోజు ఆట నిలిపివేసే సమయానికి వీరిద్దరూ క్రీజులో ఉన్నారు.

మరిన్ని వార్తలు