అజింక్యా రహానే మాకొద్దు..!

14 Nov, 2019 14:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13 సీజన్‌లో భాగంగా ఆటగాళ్ల వేలానికి సమయం దగ్గరపడుతున్న సమయంలో ఆయా ఫ్రాంఛైజీలు తమకు అవసరం లేదనుకున్న ఆటగాళ్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు క్రికెటర్లను కొన్ని ఫ్రాంఛైజీలు రిలీజ్‌ చేయగా, వారిని నగదు ఒప్పందంపై తీసుకోవడానికి వేరే ఫ్రాంఛైజీలు ముందుకొస్తున్నాయి. ఈ తరహాలోనే కింగ్ప్‌ పంజాబ్‌ జట్టు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిన ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌. ఇంకా పలువురు ఆటగాళ్లు పేర్లు తెరపైకి వస్తున్నాయి. మురళీ విజయ్‌, కరణ్‌ నాయర్‌, శార్దూల్‌ ఠాకూర్‌లను సీఎస్‌కే వదిలేయడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకుంది.

ఇప్పుడు అజింక్యా రహానేకు కూడా ఆ బాధ తప్పడం లేనట్లే కనిపిస్తోంది.  రహనేను జట్టు నుంచి విడుదల చేయాలని రాజస్తాన్‌ రాయల్స్‌ యోచిస్తోంది. గత తొమ్మిది సీజన్ల నుంచి రాజస్తాన్‌కు ఆడుతున్న రహనే.. ఈ సీజన్‌లో ఫ్రాంఛైజీ మారే అవకాశం కనబడుతోంది.  2011లో ముంబై ఇండియన్స్‌ నుంచి రాజస్తాన్‌కు మారిన రహానే అప్పట్నుంచి ఇదే ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2012 సీజన్‌లో రాజస్తాన్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రహానే నిలిచాడు. ఈసారి రహనే తమకు వద్దనే భావనలో రాయల్స్‌ ఉంది. అతన్ని విడుదల చేస్తే వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుంటే ముందుగానే వేరే ఫ్రాంఛైజీ నగదు ఒప్పందంపై అతన్ని తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కాగా, రహానేను కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ తీసుకోవడానికి ఇప్పటికే ముందుకు వచ్చినట్లు సమాచారం.



 

మరిన్ని వార్తలు