ఏ స్థానంలో ఆడడానికైనా సిద్ధం..

9 Jul, 2017 19:15 IST|Sakshi
ఏ స్థానంలో ఆడడానికైనా సిద్ధం..

కింగ్‌స్టన్‌: భవిష్యత్తు గురించి ఆలోచించనని జట్టు యాజమాన్యం ఏ స్థానంలో ఆడమంటే ఆ స్థానంలో ఆడుతానని భారత క్రికెటర్‌ అజింక్యా రహానే స్పష్టం చేశాడు. విండీస్‌ టూర్‌ లో ఓపెనర్‌గా చెలరేగిన ఈ స్టైలీష్‌ క్రికెటర్‌ ఆదివారం జరిగే ఏకైక టీ20లో రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే విండీస్‌ పర్యటన అనంతరం అజింక్యా రహానేకు జట్టులో స్థానంపై ఆందోళన నెలకొంది . గత చాంపియన్స్‌ ట్రోఫీలో పూర్తిగా బెంచ్‌కే పరిమితమైన రహానేకు  ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో అవకాశం లభించింది. అయితే ఈ సిరీస్‌ అనంతరం భారత్‌ శ్రీలంకతో 3టెస్టులు, 5 వన్డే, 2 టీ20లు ఆడనుంది.

ఈ పర్యటనకు రోహిత్‌ అందుబాటులోకి రానున్నాడు. దీంతో జట్టులో స్థానం కోసం రహానేకు పోటి నెలకొంది. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన రహానే భవిష్యత్తు గురించి ఆలోచించనని, ప్రస్తుతం వన్డే, టీ20లపైనే  దృష్టి పెట్టానని తెలిపాడు. ఓపెనర్‌గానే కాకుండా టీం మేనేజ్‌మెంట్‌ కోరితే నెం.4 , నెం.2, నెం.1 స్థానాల్లోనైనా ఆడటానికి సిద్ధమన్నాడు.

భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదని, నా వంతుగా జట్టు విజయం కోసం వంద శాతం కృషి చేస్తానని తెలిపాడు. ఇక వన్డే, టీ20లో స్థిరంగా రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రహానే పేర్కొన్నాడు. గత వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసి రాణించానని గుర్తు చేశాడు. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఎలా బ్యాటింగ్‌ చేయాలో తెలుసన్నాడు. ఇది పెద్ద సమస్యకాదని రహానే పేర్కొన్నాడు.

విండీస్‌ పర్యటనపై స్పందిస్తూ..
ఈ సిరీస్‌ నాకు చాల ముఖ్యమైనది. చాలా రోజుల తర్వాత నాకు అవకాశం లభించింది. చాంపీయన్స్‌ ట్రోఫీలో నాకు అవకాశం లభించలేదు. ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడుతావని విరాట్‌ చెప్పాడంతో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. బ్యాట్‌తో నాప్రతిభను చూపించాలని నిర్ణయించుకున్నాను. ఈ  సిరీస్‌ మొత్తం బ్యాటింగ్‌ ఆస్వాదిస్తూ రాణించానని రహానే తెలిపాడు. టీ20 మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ రాకపై స్పందిస్తూ ప్రత్యర్ధి జట్టులో గేల్‌ ఒకరే లేరు..11 మంది ఆటగాళ్లు ఉంటారు. మేము మా బలంపైనే దృష్టి పెట్టామని రహానే చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్ లో రహానే ఒక సెంచరీ 3 అర్ధ సెంచరీలతో ఓపెనర్‌గా రాణించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా