నేడు ఎథిక్స్‌ ఆఫీసర్‌ ముందుకు ద్రవిడ్‌

26 Sep, 2019 03:31 IST|Sakshi

ముంబై: ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ అంశంపై భారత మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ గురువారం బోర్డు ఎథిక్స్‌ ఆఫీసర్‌ డీకే జైన్‌ ముందు హాజరుకానున్నాడు. ద్రవిడ్‌ను ఇటీవల జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా నియమించారు. అంతకుముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమన్యంలోని ఇండియా సిమెంట్స్‌ సంస్థలో అతడు ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తుందని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఎథిక్స్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉన్నతాధికారుల సూచన మేరకు ద్రవిడ్‌ ఇండియా సిమెంట్స్‌ ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టాడు. దీంతో దిగ్గజ బ్యాట్స్‌మన్‌ ఎన్‌సీఏ డైరెక్టర్‌ పదవికే పరిమితమైనట్లు గురువారం వాదన వినిపించనున్నాడు. అనంతరం డీకే జైన్‌ తుది నిర్ణయాన్ని వెలువరిస్తారు.  

మరిన్ని వార్తలు