ద్రవిడ్‌ వ్యవహారంతో బీసీసీఐలో చీలిక

30 Apr, 2018 12:54 IST|Sakshi
టీమిండియా అండర్‌ 19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

సాక్షి, ముంబై: భారత మాజీ కెప్టెన్‌, టీమిండియా అండర్‌-19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరును ద్రోణాచార్య అవార్డుకు నామినేట్‌ చేయటం వివాదాస్పదంగా మారింది. ఏకంగా బీసీసీఐలోనే ఈ వ్యవహారం చీలిక తీసుకొచ్చింది. కోచ్‌గా అంతగా అనుభవం లేని వ్యక్తిని ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్‌ ఎలా చేస్తారంటూ ఓ వర్గం అభ్యంతరం లేవనెత్తగా.. మరో వర్గం ద్రవిడ్‌ పేరును బలపరుస్తోంది.

‘ద్రవిడ్‌ను ద్రోణాచార్య పురస్కారానికి నామినేట్‌ చేయటం సమంజసం కాదు. కోచ్‌గా కనీసం ఆయనకు మూడేళ్ల అనుభవం కూడా లేదు. ఈ నిర్ణయం ఆటగాళ్లను చిన్నతనంలోనే సానబెట్టే గురువులకు అన్యాయం చేయటమే అవుతుంది. అలాగని ద్రవిడ్‌ బీసీసీఐకి అందిస్తున్న సేవలను నేను తక్కువ చేయటం లేదు. కానీ, ఆయనను అవార్డుకు నామినేట్‌ చేయటం మాత్రం సమంజం కాదని చెబుతున్నా’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 

సుప్రీం కోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్‌ కమిటీ మాత్రం ద్రవిడ్‌.. ద్రోణాచార్య అవార్డుకు అన్ని విధాల అర్హుడంటూ వాదిస్తోంది. కమిటీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ గురువారం ద్రవిడ్‌ పేరును నామినేట్‌ చేసినట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాయ్‌.. ద్రవిడ్‌పై ప్రశంసలు గుప్పించాడు. ఇక ఈ వ్యవహారం ముదరకుండా ఇరు వర్గాలు భేటీ కావాలని నిర్ణయించాయి. క్రీడా మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఆటలో 20 ఏళ్లు కోచ్‌గా అనుభవం ఉన్న వ్యక్తులనుగానీ లేదా తక్కువ సమయంలో గొప్ప ఆటగాళ్లను తయారు చేసే కోచ్‌ల పేర్లను ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదించొచ్చు.

మరిన్ని వార్తలు