ఎన్‌సీఏ హెడ్‌ కోచ్‌ రేసులో రాహుల్‌ ద్రవిడ్‌

28 Apr, 2019 01:23 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత జూనియర్‌ జట్ల కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌ కోచ్‌గా నియమితులయ్యే ప్రక్రియ మొదలైంది. బీసీసీఐ కొత్తగా సృష్టించిన ఈ హెడ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తుల్ని ఆహ్వానించింది. ఇప్పటికే భారత్‌ ‘ఎ’, అండర్‌–19 జట్లకు ఇన్‌చార్జ్‌గా ఉన్న ద్రవిడే ఈ పదవి రేసులో ఉన్నాడని బోర్డు తెలిపింది. అయితే పారదర్శక నియామక ప్రక్రియలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని తెలిపింది. దీంతో ద్రవిడ్‌ ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకుంటాడని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

‘బీసీసీఐలోని అన్ని పదవుల నియామకానికి చేపట్టినట్లే ఈ హెడ్‌ కోచ్‌ కోసం కూడా ప్రక్రియను కొనసాగించేందుకే దరఖాస్తుల్ని ఆహ్వానిస్తాం. ఈ పదవి రేసులో ద్రవిడే ముందు న్నాడు. ఇప్పటికే ఆయన జూనియర్‌ జట్లను విజయవంతంగా తీర్చిదిద్దుతున్నాడు’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో రాహుల్‌ నామమాత్రంగా ఒక్కసారి దరఖాస్తు సమర్పిస్తే చాలు నియామకం వెంటనే జరిగిపోయే చాన్స్‌ ఉంది. గతంలో నేరుగా చేపట్టిన నియామకాలతో బోర్డుపై విమర్శలు రావడంతో ఇకపై ఏ నియామకమైనా పారదర్శకంగా చేపట్టాలని బోర్డు నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు