టీమిండియాకు అదో హెచ్చరిక

20 Mar, 2019 20:52 IST|Sakshi

ముంబై: ప్రపంచకప్‌ సులువుగా గెలుస్తుందనుకున్న టీమిండియాకు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ ఓ హెచ్చరిక వంటిదని మాజీ దిగ్గజ క్రికెటర్‌, అండర్‌-19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేర్కొన్నాడు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉన్నప్పటికీ 2-3తో సిరీస్‌ కోల్పోవడం దారుణమన్నాడు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో సంజయ్‌ మంజ్రేకరతో కలిసి పాల్గొన్న ద్రవిడ్‌ పలు విషయాలపై చర్చించారు. రెండేళ్లుగా టీమిండియా అద్భుత ఫామ్‌లో ఉందని.. దీంతో ప్రపంచకప్‌ సులువుగా గెలుస్తుందని అందరూ భావించారన్నారు.
ఇలాంటి సమయంలో ఆసీస్‌తో సిరీస్‌ ఓటమి ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. అయితే ప్రపంచకప్‌కు ముందు ఈ ఓటమి కోహ్లి సేనకు ఎంతో మంచి చేస్తుందని ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమితో ఆటగాళ్లు మరింత క్రమశిక్షణతో కష్టపడాలని సూచించాడు. ఆసీస్‌పై అనూహ్యంగా ఓడిపోయినప్పటికీ కోహ్లి సేననే ప్రపంచకప్‌లో ఫేవరేట్‌ అంటూ ద్రవిడ్‌ పేర్కొన్నాడు. అయితే అక్కడి పరిస్థితులు, ఒత్తిళ్లను ఎంత తొందరగా జయిస్తే అంతమంచిదన్నాడు.
 ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా నడుస్తున్న ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై కూడా స్పందించాడు. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని బోర్డు ఫ్రాంచైజీలకు సూచించాల్సిన అవసరం లేదన్నాడు. తమ శరీరం, ఫిట్‌నెస్‌పై ఆటగాళ్లకు ఓ అవగాహను ఉంటుందన్నారు. క్రమం తప్పకుండా బౌలింగ్‌ చేయడం వలన లయ తప్పకుండా ఉంటుందని కమిన్స్‌ చెప్పిన మాటలను ద్రవిడ్‌ గుర్తు చేశారు. ఈ మధ్య కాలంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తరుచూ గాయపడుతున్నాడని.. ఈ విషయాన్ని అతడే గమనించుకోవాలన్నాడు. ఐపీఎల్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆటగాళ్లకే వదిలేయాలని ద్రవిడ్‌ సూచించాడు.  

మరిన్ని వార్తలు