కోహ్లి, రోహిత్‌లు కాదు..  రాహులే గ్రేట్‌!

10 Mar, 2020 20:23 IST|Sakshi

ముంబై: ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రియాన్‌ లారాది ప్రత్యేక స్థానం.  సెలబ్రిటీ క్రికెటర్లలో ఒకడైన లారా  క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. టెస్టుల్లో 400 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. కాగా, ప్రస్తుత క్రికెటర్లలో ఇష్టమైన క్రికెటర్‌ ఎవరు అని లారాను అడిగిన ప్రశ్నకు కాస్త భిన్నంగా బదులిచ్చాడు. ఇక్కడ పరుగుల మెషీన్‌ విరాట్‌ కోహ్లి, హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మలను పక్కన పెట్టేసిన లారా.. కేఎల్‌ రాహుల్‌కు ఓటేశాడు. తనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్‌ రాహుల్‌ అని పేర్కొన్నాడు. (సెహ్వాగ్‌ అదే బాదుడు)

ప్రత్యేకంగా తాను రాహుల్‌ బ్యాటింగ్‌కు అభిమానినని తెలిపాడు. ‘ రాహుల్‌ ఒక గొప్ప ఎంటర్‌టైనర్‌.. గొప్ప బ్యాటింగ్‌ నైపుణ్యం కలవాడు. అతని బ్యాటింగ్‌ను చూడటాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతా. అతనొక క్లాస్‌ ప్లేయర్‌’ అని లారా తెలిపాడు. ఇక నాలుగు రోజుల టెస్టుల ప్రతిపాదనపై లారాను అడగ్గా.. మనం ఆడేది ఐదు రోజుల టెస్టా లేక నాలుగు రోజుల టెస్టా అనేది సమస్య  కాదన్నాడు. ప్రతీ మ్యాచ్‌ ఫలితం వచ్చేలా ఉంటే అప్పుడు ఎన్ని రోజులు అనేది విషయం కాదన్నాడు. మ్యాచ్‌లో ఆసక్తికరం అనేది ఉంటేనే అభిమానులు ఎక్కువగా ఆదరిస్తారన్నాడు. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌ లెజెండ్స్‌ జట్టుకు లారా సారథ్యం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా శనివారం వాంఖేడే స్టేడియం వేదికగా ఇండియా లెజెండ్స్‌-వెస్టిండీస్‌ లెజెండ్స్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో  ఇండియా లెజెండ్స్‌ విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ వీర విహారం చేశాడు. 57 బంతుల్లో 11 ఫోర్లతో   అజేయంగా 74 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా