ఆ బౌలర్లతో జర జాగ్రత్త : కోహ్లీ హెచ్చరిక

30 Jul, 2016 11:54 IST|Sakshi
ఆ బౌలర్లతో జర జాగ్రత్త : కోహ్లీ హెచ్చరిక

కింగ్స్టన్(జమైకా): నేటి(శనివారం) నుంచి భారత్, వెస్టిండీస్‌ల రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్ మన్లకు కొన్ని సూచనలు చేశాడు. బౌన్సీ పిచ్ లపై టాపార్డర్ ఆటగాళ్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాలని, ఇక్కడి మైదానంలో కచ్చితంగా ఫలితం వస్తుందని పేర్కొన్నాడు. ఎందుకంటే రెండో టెస్టుకు వేదికైన సబీనా పార్క్‌లో ఫాస్ట్ పిచ్ ఎదురుచూస్తోంది. గాయపడ్డ మురళీ విజయ్ స్థానంలో లోకేష్ రాహుల్ జట్టులోకి వచ్చాడు. రాహుల్ మంచి ఫామ్ లో ఉన్నాడని, అతడిపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని తెలిపాడు. అవసరమైతే కీపింగ్ చేయగలడం అతడికి మరో ప్లస్ పాయింట్ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన రాహుల్ జింబాబ్వే పర్యటనలో రాణించాడని, అతడికిదే సదావకాశమని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరోవైపు తొలిటెస్టు పరాభవం నుంచి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న విండీస్ పాస్ట్ పిచ్ లపై యువ బౌలింగ్ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. 19 ఏళ్ల అల్జారీ జోసెఫ్, 25 ఏళ్ల మిగుయెల్ కుమిన్స్‌లకు తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వనున్న నేపథ్యంలో సిరీస్ లో ఈ మ్యాచ్ విజయంతో 2-0 ఆధిక్యం దక్కాలంటే టాపార్డర్ తో పాటు, పేస్ బౌలర్లు విజృంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. 2008 తర్వాత ఇక్కడ ఏ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరగలేదని, 2011లో భారత్ కూడా తన మ్యాచ్‌ను 4 రోజుల్లోనే నెగ్గిన విషయాన్ని భారత సహచర ఆటగాళ్లకు కోహ్లీ గుర్తుచేశాడు.

మరిన్ని వార్తలు