రాహుల్ చేజారిన శతకం

23 Jul, 2015 00:47 IST|Sakshi
రాహుల్ చేజారిన శతకం

భారత్ ‘ఎ’ 221/6

చెన్నై: ఆస్ట్రేలియా ‘ఎ’తో ప్రారంభమైన తొలి అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ బ్యాటింగ్ తడబడింది. వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ 77.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (185 బంతుల్లో 96; 14 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కెప్టెన్ పుజారా (122 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, శ్రేయస్ అయ్యర్ (58 బంతుల్లో 39; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.

ఆసీస్ బౌలర్లలో ఫెకెట్, కీఫ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచిన భారత్ ‘ఎ’ బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో ఓవర్లోనే ముకుంద్ (9) వెనుదిరిగాడు. ఈ దశలో రాహుల్, పుజారా కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. పుజారాతో పాటు నాయర్ (0) తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా, అయ్యర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించి రాహుల్ మరోసారి ఆదుకున్నాడు. నమన్ ఓజా (56 బంతుల్లో 10) పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడగా...94 పరుగుల వ్యవధిలో భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది.

మరిన్ని వార్తలు