భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. వర్షం గెలిచేట్టుంది!

15 Jun, 2019 10:17 IST|Sakshi

లండన్‌ : అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న భారత్‌-పాకిస్తాన్‌ ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌ ఈ ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాయాదీ పోరులో వర్షం విజయం సాధించేలా ఉందని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ సందేహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటికే 4 మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందని అక్కడి వాతావరణ పరిస్థితిని బట్టి అర్థం అవుతోంది. దీంతో అక్తర్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఓ ఫన్నీ మీమ్‌ను షేర్‌ చేశాడు. టాస్‌ కోసం ఇరు జట్ల కెప్టెన్లు మైదానంలోకి వెళ్లగానే వర్షం ప్రారంభమైందని, దీంతో కోహ్లి, సర్ఫరాజ్‌లు స్విమ్‌ చేకుంటూ బయటకు వస్తున్నారని, క్రికెట్‌ ఎక్స్‌పెర్ట్స్‌ బోట్‌పై నిలబడి మరి విశ్లేషిస్తున్నారని తెలిపేలా ఆ మీమ్‌ ఉంది. దీనికి ‘ఆదివారం చోటుచేసుకునేది ఇదే’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశాడు. దీన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ సైతం రీట్వీట్‌ చేశాడు. ఇప్పటికే వర్షం విషయంలో అభిమానులు ఐసీసీపై కుళ్లు జోకులు పేల్చుతున్నారు. 11వ జట్టుగా పాల్గొన్న వర్షం సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకుందని, ఆటగాళ్లు క్రికెట్‌ ఆడకుండా స్విమ్మింగ్‌ చేస్తున్నారనే సెటైర్లతో ట్రోల్‌ చేస్తున్నారు.

ఇక ప్రతి మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయిస్తే టోర్నీ చాలా రోజులు నిర్వహించాల్సి ఉంటుందని, ఇది ఆచరణకు అసాధ్యమని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్సన్‌ తెలిపాడు. ఒక వేళ రిజర్వ్‌డే కేటాయిస్తే పిచ్‌ ఏర్పాటు, జట్లు వసతి, ఆటగాళ్ల ప్రయాణాలపై ప్రభావం ఉంటుందన్నాడు. ముఖ్యంగా ప్రేక్షకులకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయన్నాడు. పైగా రిజర్వ్‌డే కూడా వర్షం పడకుండా ఉంటుందనే గ్యారంటీ లేదని పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు