వరుణుడు కరుణిస్తేనే...!

25 Oct, 2013 01:15 IST|Sakshi
వరుణుడు కరుణిస్తేనే...!

కటక్: భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో భారీ వర్షంతో ఇప్పటికే ఒక వన్డే రద్దు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి తర్వాత జరగబోయే ఐదో వన్డేపై నిలిచింది. అయితే ఒడిశాలోని కటక్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. సోమవారంనుంచి  ఒడిశాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కనీసం శుక్రవారం ఉదయం వర్షాలు ఆగితే గానీ శనివారం మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసే అవకాశం లేదు.

 అయితే వాతావరణ శాఖ నివేదిక ప్రకారం శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఇక్కడ భారీ వర్ష సూచన ఉంది. ఇక్కడి బారాబతి స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మైదానంలో భారీగా నీరు చేరినా పిచ్‌లను మాత్రం పూర్తిగా కవర్ చేసి జాగ్రత్త పడినట్లు క్యురేటర్ పంకజ్ పట్నాయక్ చెప్పారు. మరో వైపు మ్యాచ్‌పై అభిమానుల ఆసక్తి మాత్రం తగ్గలేదు. 45 వేల సామర్థ్యం గల స్టేడియంలో ఇప్పటికే 42 వేల టికెట్లను ఫ్యాన్స్ సొంతం చేసుకున్నారు.
 
 బావులు తవ్వేశారు!
 భారత క్రికెట్ బోర్డు అనుకుంటే కొండ మీది కోతినైనా తేగలదు. ఎలాగైనా మ్యాచ్‌ను నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ఒరిస్సా క్రికెట్ సంఘం (ఓసీఏ) అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  వినేందుకు కొత్తగా అనిపిస్తున్నా... మైదానంలోని వర్షపు నీరును బయటికి పంపించేందుకు దాని చుట్టుపక్కల పరిధిలో ఏకంగా నాలుగు బావులు కూడా తవ్వేశారు! మరో వైపు వర్షం ఆగిన తర్వాత పిచ్, అవుట్ ఫీల్డ్‌ను ఆరబెట్టేందుకు హెలికాప్టర్‌ను ఉపయోగించాలని కూడా ఓసీఏ నిర్ణయించింది. ఇందు కోసం స్థానిక ఎంపీకి చెందిన హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోనున్నారు. అయితే ఆదివారం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఓసీఏ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

మరిన్ని వార్తలు