‘పాల బుగ్గల’ పోటుగాడు!

12 Dec, 2013 01:07 IST|Sakshi
‘పాల బుగ్గల’ పోటుగాడు!

ఏడాది క్రితం...చాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైవెల్డ్ లయన్స్ తడబడింది. నిప్పులు చిమ్ముతున్న జాన్సన్, మలింగ బౌలింగ్‌కు ఎదురొడ్డి 19 ఏళ్ల కుర్రాడు తన జట్టును విజేతగా నిలిపాడు.
 
 గత గురువారం... అదే వాండరర్స్ మైదానంలో ఆ కుర్రాడే మైదానంలోకి దిగుతుంటే అభిమానులు నీరాజనాలు పట్టారు. జొహన్నెస్‌బర్గ్‌లోనే పుట్టిన ఈ కుర్రాడు తొలిసారి సొంతగడ్డపై ఆడుతూ అద్భుత సెంచరీతో తన ఫ్యాన్స్ అంచనాలను అందుకున్నాడు.
 
 దక్షిణాఫ్రికా క్రికెట్‌లో పాత రికార్డులన్నీ చెరిపేస్తూ ఇంత తొందరగా ఒక కుర్రాడు దూసుకుపోవడం విశేషమే. పాలుగారే బుగ్గలు, అమ్మాయిలా సున్నితంగా కనిపించే మొహంతో ఇంకా పసితనం వీడనట్లు ఉండే క్వాంటన్ డి కాక్... ఫామ్‌లో ఉన్న టీమిండియాపై వరుసగా మూడు శతకాలతో తన సత్తా చూపించాడు. వికెట్ కీపర్‌గా కూడా చురుకైన కదలికలతో...బౌచర్‌లాంటి దిగ్గజం స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడిననే సందేశానిచ్చాడు.
 
 స్కూల్ స్థాయిలోనే: దక్షిణాఫ్రికా ప్రస్తుత కెప్టెన్ గ్రేమ్ స్మిత్ చదివిన కింగ్ ఎడ్వర్డ్ హైస్కూల్‌లోనే చదివిన డి కాక్ అక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకున్నాడు. అదే సమయంలో క్లబ్ క్రికెట్‌లో భారీగా పరుగులు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ ప్రదర్శనతో పాటు దూకుడైన మనస్తత్వం అతడికి జాతీయ అండర్-19 జట్టు కెప్టెన్‌గా కూడా అవకాశం కల్పించింది.  
 
 కలిసొచ్చాయి: సీఎల్‌టి20 ప్రదర్శన, ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో నిలకడతో పాటు డివిలియర్స్ విశ్రాంతి కోరడంతో ఈ కుర్రాడికి దక్షిణాఫ్రికా సీనియర్ టీమ్ నుంచి పిలుపు వచ్చింది. బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా వికెట్ కీపర్‌గా రాణించడం, చిన్న వయసు కూడా కావడంతో వరుసగా అతడిని కొనసాగించారు.
 
 ఈ మధ్యలో సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఎట్టకేలకు తాను ఆడిన తొమ్మిదో వన్డేలో (పాక్‌పై) శతకంతో పోటీలో ఉన్న కీపర్లను వెనక్కి తోసి కాక్ నిలదొక్కుకున్నాడు. ఇక భారత్‌తో సిరీస్‌లో లభించిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ఎన్నో ఏళ్ల అనుభవం తర్వాతే దిగ్గజాలకు సాధ్యమైన వరుస సెంచరీల రికార్డును చిన్న వయసులోనే అందుకున్నాడు. ఈ సిరీస్‌లో ఆడిన తీరు చూస్తుంటే భవిష్యత్తులో టెస్టు జట్టులో అతనికి చోటు దక్కొచ్చు.                      
 - సాక్షి క్రీడావిభాగం
 
 వచ్చే బుధవారంతో 21 ఏళ్లు నిండనున్న ఈ కుర్రాడు వ్యక్తిగత జీవితంలో మాత్రం ముదురేనండోయ్. మైనార్టీ తీరగానే గత రెండేళ్లుగా సాషా హర్లీ అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు.
 
  21 ఏళ్లలోపే 4 సెంచరీలు సాధించిన డి కాక్... స్టిర్లింగ్ (ఐర్లాండ్) రికార్డు సమం చేశాడు.
 
  3 వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు(342) చేసిన ఆటగాడు డికాక్  
 
 ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండానే డి కాక్ 4 సెంచరీలు చేయడం విశేషం. తక్కువ ఇన్నింగ్స్‌లలో (16) నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడు కూడా అతనే.
 

మరిన్ని వార్తలు