.రాజస్థాన్ కెప్టెన్‌గా వాట్సన్

11 Mar, 2014 00:59 IST|Sakshi
.రాజస్థాన్ కెప్టెన్‌గా వాట్సన్

వచ్చే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షేన్ వాట్సన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గత సీజన్ అనంతరం రాహుల్ ద్రవిడ్ టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో రాయల్స్ యాజమాన్యం తాజా నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే జట్టుకు ద్రవిడ్ మెంటర్‌గా వ్యవహరిస్తాడు. రాయల్స్ వ్యూహాల్లో భాగస్వామిగా ఉంటూ యువ ఆటగాళ్లను తీర్చి దిద్దే బాధ్యతలు ఈ మాజీ కెప్టెన్ చేపడతాడు.

2008లో జరిగిన మొదటి ఐపీఎల్‌నుంచీ వాట్సన్... రాజస్థాన్ జట్టులోనే కొనసాగుతున్నాడు. ఆ ఏడాది టీమ్ టైటిల్ గెలుచుకోవడంలో ఈ ఆల్‌రౌండర్ కీలక పాత్ర పోషించాడు. గత ఆరు సీజన్లలో కలిపి ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లు ఆడిన వాట్సన్ 145.59 స్ట్రైక్ రేట్‌తో 1,785 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 48 వికెట్లు కూడా పడగొట్టాడు. తనకు కొత్తగా కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని వాట్సన్ అన్నాడు. యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, ఐపీఎల్-7లో జట్టును గెలిపిస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు.
 

మరిన్ని వార్తలు