బట్లర్‌ గెలిపించాడు..

11 May, 2018 23:50 IST|Sakshi

జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక‍్కడ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ ఇంకా బంతి ఉండగా ఛేదించింది. తద్వారా ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి రాజస్తాన్‌ ప్రతీకారం తీర్చుకుంది. రాజస్తాన్‌ ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌(95 నాటౌట్‌;60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. అతనికి జతగా శాంసన్‌(21), స్టువర్ట్‌ బిన్నీ(22)లు ఫర్వాలేదనిపించారు.

అంతకముందు సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై 19 పరుగుల వద్ద అంబటి రాయడు(12) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో మరో ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌కు జత కలిసిన సురేశ్‌ రైనా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ రెండో వికెట్‌ 86 పరుగుల భాగస‍్వామ్యాన్ని సాధించిన తర్వాత వాట్సన్‌(39; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. ఆపై రైనాకు ఎంఎస్‌ ధోని జత కలిశాడు.

కాగా, హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన తర్వాత రైనా(52;35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యతను మరోసారి భుజాలపై వేసుకున్న ధోని సమయోచితంగా ఆడాడు. సామ్‌ బిల్లింగ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ధోని(33 నాటౌట్‌; 23 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌),  సామ్‌ బిల్లింగ్స్‌(27;‌ 22 బంతుల్లో 3 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడారు. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు తీయగా, ఇష్‌ సోథీకి ఓ వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు