రసవత్తర పోరులో రాజస్తాన్‌దే విజయం

22 Apr, 2018 23:53 IST|Sakshi

జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. సంజూ శాంసన్‌(52), బెన్‌ స్టోక్స్‌(40), కృష్ణప్ప గౌతమ్‌(33 నాటౌట్‌)లు రాజస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు.  ఓపెనర్లు అజింక్యా రహానే(14), రాహుల్‌ త్రిపాఠి(9)లు నిరాశపరిచినా, శాంసన్‌-స్టోక్స్‌లు కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. చివరి ఓవర్‌లో రాజస్తాన్‌ విజయానికి 10 పరుగులు కావాల్సిన తరుణంలో కృష్ణప్ప గౌతమ్‌ ఫోర్‌, సిక్సర్‌తో జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.


అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌  నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ముంబైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ లూయిస్‌ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. ఆపై మరో ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌ 129 పరుగులు జత చేశారు.

ఈ క్రమంలోనే సూర్యకుమార్‌ యాదవ్‌(72;47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌(58;42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలు సాధించారు. అయితే వీరు ఐదు పరుగుల వ్యవధిలో వరుసగా పెవిలియన్‌ చేరడంతో ముంబై స్కోరు మందగించింది. రోహిత్‌ శర్మ గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ కాగా, పొలార్డ్‌(21 నాటౌట్‌) ఫర్వాలేదనిపించాడు. ఇక చివర్లో కృనాల్‌ పాండ్యా(7)హార్దిక్‌ పాండ్యా(4), మిచెల్‌ మెక్లీన్‌గన్‌(0) నిరాశపరిచారు.

ఈ మ్యాచ్‌లో ముగ్గురు ముంబై ఆటగాళ్లు గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ కావడం గమనార్హం. ఎవిన్‌ లూయిస్‌, రోహిత్‌ శర్మ, మెక్లీన్‌గన్‌లు ఆడిన తొలి బంతికే పెవిలియన్‌ చేరారు. దాంతో ముంబై ఇండియన్స్‌  రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర‍్చర్‌ మూడు వికెట్లు సాధించగా, కులకర్ణి రెండు వికెట్లు తీశాడు. ఉనాద్కత్‌కు వికెట్‌ లభించింది. ఇది రాజస్తాన్‌కు మూడో విజయం కాగా, ముంబైకు నాల్గో ఓటమి.

>
మరిన్ని వార్తలు