గౌతమ్‌ గర్జన

23 Apr, 2018 03:37 IST|Sakshi

మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను గెలిపించిన ఆల్‌రౌండర్‌

11 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్సర్లతో 33 నాటౌట్‌

ముంబైకి నాలుగో ఓటమి

అటువైపు ఇటువైపు బ్యాటింగ్‌లో రెండేసి మంచి ఇన్నింగ్స్‌లు. బౌలింగ్‌లో రెండు చక్కటి స్పెల్‌లు. ముంబై ఇండియన్స్, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య విజయం ఇలా దోబూచులాడుతున్న దశలో ఒక్క మెరుపు ఇన్నింగ్స్‌ ఫలితాన్ని మార్చేసింది. ఎక్కడో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కృష్ణప్ప గౌతమ్‌... ఎవరూ ఊహించిన విధంగా చెలరేగి రాయల్స్‌ను గెలిపించాడు.   
GOUTHAM
జైపూర్‌: పరాజయాల బాటలో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌కు గెలుపు ఉపశమనం. అప్పటిదాక అడపాదడపా మెరుపులతో సాదాసీదాగా సాగి... చివర్లో ఉత్కంఠభరితంగా మారిన మ్యాచ్‌లో ఆ జట్టు ముంబై ఇండియన్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.

సూర్యకుమార్‌ యాదవ్‌ (47 బంతుల్లో 72; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు); ఇషాన్‌ కిషన్‌ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రాయల్స్‌ అరంగేట్ర బౌలర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోఫ్రా అర్చర్‌ (3/22) కీలక సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ఛేదనలో సంజు శామ్సన్‌ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ల భాగస్వామ్యంతో పాటు గౌతమ్‌ (11 బంతుల్లో 33 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అనూహ్య ఆటతో రాయల్స్‌ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.  

ఎంతో చేస్తుందనుకుంటే...
ఎదుర్కొన్న తొలి బంతికే ఓపెనర్‌ లూయీస్‌ (0) ఔట్‌ కాగా... ముంబై ఇన్నింగ్స్‌ ఆసాంతం సూర్యకుమార్, ఇషాన్‌ చుట్టూనే తిరిగింది. నాలుగు ఓవర్ల పాటు ఆచితూచి ఆడిన వీరు అయిదో ఓవర్లో 18 పరుగులు పిండుకుని జోరు పెంచారు. తర్వాత ఇదే నిలకడ చూపారు. పదో ఓవర్లోనూ 18 పరుగులు బాదారు. సూర్యకుమార్‌ 29 బంతుల్లో, ఇషాన్‌ 35 బంతుల్లో అర్ధ శతకాలు అందుకున్నారు. ఈ క్రమంలో 82 బంతుల్లోనే 129 పరుగులు జోడించారు.

ఈ సీజన్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. అయితే... 8 బంతుల వ్యవధిలో ఇషాన్, సూర్యకుమార్‌తో పాటు కెప్టెన్‌ రోహిత్‌ (0) వెనుదిరగడంతో పరిస్థితి తలకిందులైంది. 19వ ఓవర్‌ వేసిన అర్చర్‌ మొదట కృనాల్‌ పాండ్యా (7), తర్వాత అద్భుత బంతులతో హార్దిక్‌ (4), మెక్లీనగన్‌ (0)లను బౌల్డ్‌ చేశాడు. పొలార్డ్‌ (20 బంతుల్లో 21 నాటౌట్‌) ధాటిగా ఆడలేకపోయాడు. చివరి 35 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేసిన ముంబై... ఆరు వికెట్లు కోల్పోవడంతో ఊహించినదాని కంటే చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది.

గెలిచేస్తుందనుకుంటే...
ఛేదనలో రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ కూడా సాధారణంగానే ప్రారంభమైంది. ఓపెనర్‌గా వచ్చిన రాహుల్‌ త్రిపాఠి (9), కెప్టెన్‌ రహానే (14) త్వరగానే వెనుదిరిగారు. అయితే... సంజు, స్టోక్స్‌ మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించి పరి స్థితిని చక్కదిద్దారు. వీరిద్దరూ ఉండగా 6 ఓవర్లలో 58 పరుగులు చేయాల్సిన దశలో రాయల్స్‌ సులువుగా గెలిచేస్తుందనిపించింది. కానీ బుమ్రా (2/28) ధాటికి బట్లర్‌ (6), క్లాసెన్‌ (0) వరుస బంతుల్లో అవుటయ్యారు. అర్చర్‌ (8) కూడా విఫలమవడంతో ఆశలు అడుగంటాయి. రాజస్తాన్‌ విజయానికి 18 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన స్థితిలో గౌతమ్‌ ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగాడు. హార్దిక్‌ పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో తానే స్ట్రైకింగ్‌ తీసుకుని ఫోర్, సిక్స్‌తో ఘనంగా ముగించాడు.

మరిన్ని వార్తలు