గెలిచేదాకా నడిపించాడు

14 May, 2018 04:12 IST|Sakshi

మరో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన బట్లర్‌

రాజస్తాన్‌ 7 వికెట్లతో జయభేరి

ముంబై ప్లే ఆఫ్‌ ఆశలు క్లిష్టం  

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు పెద్ద దెబ్బ! మూడు సార్లు చాంపియన్‌ జట్టు ప్లే ఆఫ్‌ ఆశలకు దాదాపు తెరదించేలా రాజస్తాన్‌ రాయల్స్‌ షాకిచ్చింది. మ్యాచ్‌కు ముందు అన్నీ గెలిస్తే ముందుకు వెళ్లొచ్చులే అనుకున్న రోహిత్‌ సేన అంచనాలను బట్లర్‌ మరో సూపర్‌ ఇన్నింగ్స్‌తో తుంచేశాడు. దీంతో రాయల్స్‌ ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగయ్యాయి.

ముంబై: బట్లర్‌ మళ్లీ కదంతొక్కాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ను గెలిచేదాకా నడిపించాడు. నిలకడకు వేగం జోడించే ఈ ఓపెనర్‌ అజేయ పోరాటంతో రాయల్స్‌ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై జయభేరి మోగించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. లూయిస్‌ (42 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్‌ (31 బంతుల్లో 38; 7 ఫోర్లు) రాణించారు. స్టోక్స్, ఆర్చర్‌ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్‌ 2 ఓవర్లు మిగిలుండగానే 18 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బట్లర్‌ (53 బంతుల్లో 94 నాటౌట్‌; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత ప్రదర్శన ఇచ్చాడు. కెప్టెన్‌ రహానే (36 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించాడు.  

బౌండరీలతో మొదలైంది...కానీ
టాస్‌ నెగ్గిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంటే... బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఓపెనర్లు సూర్యకుమార్‌ యాదవ్, లూయిస్‌ బౌండరీలతో దడదడ లాడించారు. క్రిష్ణప్ప గౌతమ్‌ వేసిన తొలి ఓవర్లో యాదవ్‌ 2, లుయీస్‌ ఒక ఫోర్‌ బాదాడు. ఆరంభం నుంచే పుంజుకున్న ముంబై ఇన్నింగ్స్‌ ఓవర్‌కు 8 పరుగులు చొప్పున సాగింది. దీంతో రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసేటప్పటికే ఏకంగా ఆరుగురు బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. తొమ్మిదో ఓవర్లో లూయిస్‌ సిక్సర్లతో వేగం పెంచాడు. శ్రేయస్‌ గోపాల్‌ తొలి బంతిని లెగ్‌సైడ్‌లో ఫ్లాట్‌ సిక్స్‌గా మలిచిన అతను తర్వాతి బంతిని లాంగాఫ్‌లో భారీ సిక్సర్‌గా తరలించాడు. తొలి సగం ఓవర్లు ముగిసేసరికి ముంబై వికెట్‌ కోల్పోకుండా 86 పరుగులు చేసింది. కానీ ఆ మరుసటి ఓవర్లో ఆర్చర్‌... ఓపెనర్‌ సూర్యకుమార్‌తో పాటు కెప్టెన్‌ రోహిత్‌ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత ముంబై ఇన్నింగ్స్‌లో జోరు తగ్గిపోయింది.  

మళ్లీ అజేయ పోరాటం...
తొలి ఓవర్లోనే రాజస్తాన్‌ షార్ట్‌(4) వికెట్‌ను కోల్పోయింది. రహానే క్రీజులోకి రాగా... షరామామూలుగానే బట్లర్‌ తన నిలకడ కొనసాగించాడు. కుదిరితే బౌండరీతో లేదంటే సింగిల్స్‌తో ఎక్కడా ఇన్నింగ్స్‌ను తడబడకుండా నిలబెట్టాడు. కృనాల్‌ వేసిన ఐదో ఓవర్లో కవర్స్‌ దిశగా ఫోర్‌ కొట్టిన బట్లర్‌ ఆ తర్వాతి బంతిని సిక్సర్‌గా మలిచాడు. తర్వాత హార్దిక్‌ బౌలింగ్‌లో, బుమ్రా ఓవర్లో కూడా బౌండరీలు బాదాడు. దీంతో రాజస్తాన్‌ తొలి పది ఓవర్లలో వికెట్‌ నష్టానికి 83 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన బట్లర్‌ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక హార్దిక్‌ బౌలింగ్‌లో రహానే నిష్క్రమించాడు. తర్వాత బట్లర్‌కు జతైన సంజూ శామ్సన్‌ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. లక్ష్యానికి 4 పరుగుల ముందు అతను నిష్క్రమించగా, సిక్సర్‌ కొట్టి బట్లర్‌ రాయల్స్‌ విజయాన్ని ఖాయం చేశాడు.

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) ఉనాద్కట్‌ (బి) ఆర్చర్‌ 38; లూయిస్‌ (సి) శామ్సన్‌ (బి) కులకర్ణి 60; రోహిత్‌ శర్మ (సి) ఉనాద్కట్‌ (బి) ఆర్చర్‌ 0; ఇషాన్‌ కిషన్‌ (సి) శామ్సన్‌ (బి) స్టోక్స్‌ 12; హార్దిక్‌ (సి) శామ్సన్‌ (బి) స్టోక్స్‌ 36; కృనాల్‌ (సి) గౌతమ్‌ (బి) ఉనాద్కట్‌ 3; కటింగ్‌ నాటౌట్‌ 10; డుమిని నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168.

వికెట్ల పతనం: 1–87, 2–87, 3–108, 4–119, 5–131, 6–166. బౌలింగ్‌: గౌతమ్‌ 2–0–23–0, కులకర్ణి 4–0–43–1, ఆర్చర్‌ 4–0–16–2, స్టోక్స్‌ 4–0–26–2, గోపాల్‌ 2–0–21–0, ఉనాద్కట్‌ 4–0–37–1.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: షార్ట్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) బుమ్రా 4; బట్లర్‌ నాటౌట్‌ 94; రహానే (సి) యాదవ్‌ (బి) హార్దిక్‌ 37; శామ్సన్‌ (సి) సబ్‌– చహర్‌ (బి) హార్దిక్‌ 26; స్టోక్స్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18 ఓవర్లలో 3 వికెట్లకు) 171.

వికెట్ల పతనం: 1–9, 2–104, 3–165. బౌలింగ్‌: బుమ్రా 3–0–34–1, మెక్లీనగన్‌ 4–0–28–0, కృనాల్‌ 4–0–24–0, హార్దిక్‌ 4–0–52–2, మార్కండే 3–0–32–0  

టి20ల్లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లో ఐదు అర్ధ సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌ బట్లర్‌. గతంలో సెహ్వాగ్‌ (ఢిల్లీ డేర్‌డెవిల్స్‌–2012లో); మసకద్జా (జింబాబ్వే–2012లో), కమ్రాన్‌ అక్మల్‌ (లాహోర్‌ వైట్స్‌–2017లో) ఈ ఘనత సాధించారు.

>
మరిన్ని వార్తలు