‘రాయల్’ గా ఆరంభం

22 Sep, 2013 00:56 IST|Sakshi
‘రాయల్’ గా ఆరంభం

 గత ఐపీఎల్‌లో సొంతగడ్డపై అన్ని మ్యాచ్‌లూ గెలిచిన సంప్రదాయాన్ని రాజస్థాన్ రాయల్స్ చాంపియన్స్‌లీగ్‌లోనూ కొనసాగించింది. తమ తొలి మ్యాచ్‌లో ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై అలవోకగా గెలిచింది.
 
 జైపూర్: ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత... రాజస్థాన్ రాయల్స్ ఆట కంటే మిగిలిన విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. చాంపియన్స్ లీగ్‌కు ముందు ఆ జట్టు షాక్ నుంచి తేరుకుందా లేదా అనే అంశంపై భారీగా చర్చ జరిగింది. కానీ మైదానంలోకి దిగాక అవన్నీ పక్కకి నెట్టిన రాయల్స్ చాంపియన్స్‌లీగ్‌ను ఘనంగా ప్రారంభించింది. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో శనివారం జరిగిన గ్రూప్ ఎ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై అలవోకగా నెగ్గింది.
 
 టాస్ గెలిచిన ద్రవిడ్ బౌలింగ్ ఎంచుకోగా... ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. రాజస్థాన్ పేసర్ విక్రమ్‌జీత్ మాలిక్ చక్కగా బౌలింగ్ చేసి స్మిత్ (9), కార్తీక్ (2)ల వికెట్లు తీయడంతో ముంబై తడబడింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (17 బంతుల్లో 15; 3 ఫోర్లు) మంచి టచ్‌లోనే కనిపించినా.... ఎక్కువసేపు నిలబడలేకపోయాడు.
 
  రాయుడు (3) కూడా రనౌట్‌గా వెనుదిరగడంతో ముంబై జట్టు 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ (37 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పొలార్డ్ (36 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. తొలుత రోహిత్, ఆ తర్వాత పొలార్డ్ వేగంగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ ఇద్దరూ అవుటయ్యాక... చివరి ఓవర్లో కౌల్టర్ నైల్ (5 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) ఉపయోగకరమైన పరుగులు సాధిం చాడు. రాయల్స్ బౌలర్లలో విక్రమ్‌జీత్ మాలిక్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
 
 రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే కెప్టెన్ ద్రవిడ్ (1) వికెట్‌ను కోల్పోయినా... రహానే (31 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్సర్), సంజు శామ్సన్ (47 బంతుల్లో 54; 8 ఫోర్లు) కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 74 పరుగులు జోడించారు. గత ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన శామ్సన్ ఈసారి కూడా నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీ సాధించాడు. శామ్సన్ అవుటయ్యాక వాట్సన్ (22 బంతుల్లో 27 నాటౌట్; 2 సిక్సర్లు), స్టువర్ట్ బిన్నీ (14 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) చకచకా పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు.
 
 స్కోరు వివరాలు
 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) మాలిక్ 9; సచిన్ (సి) శామ్సన్ (బి) బిన్నీ 15; దినేశ్ కార్తీక్ (బి) మాలిక్ 2; రోహిత్ శర్మ (సి) శామ్సన్ (బి) వాట్సన్ 44; రాయుడు రనౌట్ 3; పొలార్డ్ (సి) శామ్సన్ (బి) మాలిక్ 42; హర్భజన్ రనౌట్ 8; కౌల్టర్ నైల్‌నాటౌట్ 12; రిషి ధావన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 5) 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 142.
 
 వికెట్ల పతనం: 1-9; 2-26; 3-38; 4-43; 5-95; 6-130; 7-141.
 బౌలింగ్: మేనరియా 2-0-9-0; విక్రమ్‌జీత్ మాలిక్ 4-0-24-3; ఫాల్క్‌నర్ 4-0-31-0; వాట్సన్ 3-0-26-1; స్టువర్ట్ బిన్నీ 2-0-13-1; రాహుల్ శుక్లా 2-0-6-0; కూపర్ 3-0-31-0.
 
 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (సి) పొలార్డ్ (బి) కౌల్టర్ నైల్ 1; రహానే (బి) రిషి ధావన్ 33; శామ్సన్ (సి) స్మిత్ (బి) పొలార్డ్ 54; వాట్సన్ నాటౌట్ 27; స్టువర్ట్ బిన్నీ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 4, వైడ్లు 2) 6; మొత్తం (19.4 ఓవర్లలో మూడు వికెట్లకు) 148.
 వికెట్ల పతనం: 1-5; 2-79; 3-107.
 
 బౌలింగ్: జాన్సన్ 4-0-38-0; కౌల్టర్ నైల్ 3.4-0-22-1; రిషి ధావన్ 4-0-17-1; ప్రజ్ఞాన్ ఓజా 1-0-13-0; హర్బజన్ 3-0-22-0; పొలార్డ్ 3-0-20-1; డ్వేన్ స్మిత్ 1-0-12-0.
 

మరిన్ని వార్తలు