కోహ్లి ఇచ్చిన మొక్కతో..

16 Apr, 2018 20:03 IST|Sakshi
కోహ్లి ఇచ్చిన మొక్కతో రహానే

10 లక్షల మొక్కలు నాటనున్న రాజస్తాన్‌ రాయల్స్‌ 

బెంగళూరు : గో గ్రీన్‌ అంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు గత కొన్నేళ్లుగా కృషి చేస్తోంది.  2011 నుంచి ప్రతి ఐపీఎల్‌ సీజన్‌లో ఏదో ఒక మ్యాచ్‌లో ‘గో గ్రీన్‌’ అంటూ ఆకుపచ్చ రంగు జెర్సీ ధరించి మ్యాచ్‌ను ఆడటం ఆనవాయితీగా వస్తోంది. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి అవగాహన కల్పించడమే దీని వెనుక  ఉన్న ప్రధాన ఉద్దేశం. తాజా సీజన్‌లో ఆదివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్‌ జెర్సీలో బరిలోకి దిగిన కోహ్లి సేన.. రాజస్తాన్‌ కెప్టెన్‌ రహానేకు మొక్కను అందించింది. 

ఇక ఆర్సీబీ ఇచ్చిన స్పూర్తితో రాజస్తాన్‌ జట్టు మరో అడుగు ముందుకేసింది. ‘పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అనే నినాదాన్ని ప్రజల్లోకి మరింత చేర్చాలనే ఉద్దేశంతో ఏకంగా 10 లక్షల మొక్కలు నాటడానికి సిద్దమైంది.  ఈ 10 లక్షల మొక్కలను రాజస్తాన్‌ వ్యాప్తంగా ఉన్న అటవీ పరిసరప్రాంతాల్లో, సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం చుట్టు నాటనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని రాజస్తాన్‌ ప్రభుత్వం, ఎన్జీవోల సహకారంతో పూర్తి చేయనుంది. ఇదేకాకుండా ప్రజల్లో పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనుంది. ఇక ఆర్సీబీ చేపట్టిన గోగ్రీన్‌ ప్రచారం చాలా మార్పు తీసుకొచ్చిందని ఆ జట్టు చైర్మెన్‌ రంజీత్‌ బార్తాకుర్‌ తెలిపారు. పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతన్నారు. తమ నినాదంతో ముందుకొచ్చిన రాజస్తాన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు