ఐపీఎల్‌కు స్మిత్‌ దూరం!

14 Jan, 2019 16:57 IST|Sakshi

ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశం

ముంబై : బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో గత సీజన్‌ ఐపీఎల్‌కు దూరమైన ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌.. ఈ సీజన్‌కు సైతం దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొన్న ఈ ఆసీస్‌ క్రికెటర్‌.. గాయంతో  అర్ధాంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ లీగ్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన స్మిత్‌కు కుడిమోచేతికి తీవ్ర గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించారు. దీంతో స్మిత్‌ టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. మంగళవారం వైద్యులు అతనికి సర్జరీ చేయనున్నారు. అయితే సర్జరీ అనంతరం స్మిత్‌ ఎంత లేదన్నా.. ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే స్మిత్‌ ఎప్రిల్‌ 15 వరకు బెడ్‌రెస్ట్‌లోనే ఉండాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఐపీఎల్‌-12 సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లకు స్మిత్‌ దూరం కావాల్సి ఉంటుంది. మళ్లీ టోర్నీ చివర్లో ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా ఆయాదేశాలు తమ ఆటగాళ్లను వెనక్కి పిలిచే అవకాశం ఉంది.

దీంతో ఈ సీజన్‌లో స్మిత్‌ సేవలను చాలా మ్యాచ్‌లకు రాజస్తాన్‌ రాయల్స్‌ కోల్పోనుంది. ఇందులో భాగంగానే జట్టు యాజమాన్యం ప్రత్యామ్నాయం మార్గాలను అన్వేశిస్తుందని, స్మిత్‌ స్థానంలో మరో క్రికెటర్‌ తీసుకోవాలనే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇక ఈ గాయం స్మిత్‌ పునరాగమనంపై కూడా ప్రభావం చూపనుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. మార్చి 28తో స్మిత్‌ నిషేధకాలం పూర్తి కానుందని, అనంతరం అతను దేశవాళీ క్రికెట్‌ ఆడి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ స్మిత్‌ గాయంతో బెడ్‌ రెస్ట్‌లో ఉంటే అతను ఆసీస్‌ ఆడబోయే ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌, యాషెస్‌ సిరీస్‌లకు దూరమయ్యే అవకాశం ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు