రాజస్తాన్‌ చేతిలో బెంగళూరు చిత్తు

15 Apr, 2018 19:42 IST|Sakshi
విజయానందంలో రాజస్తాన్‌ ఆటగాళ్లు

భారీ లక్ష్యచేధనలో తడబడ్డ ఆర్సీబీ

చెలరేగిన సంజూ శాంసన్‌

బెంగళూరు : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)ను సొంతగడ్డపై చిత్తుచేసి ఈ సీజన్‌ ఐపీఎల్‌లో రెండో విజయం నమోదు చేసింది రాజస్థాన్‌ రాయల్స్‌. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ 92(45 బంతులు, 2 ఫోర్లు, 10 సిక్సులు) దూకుడుకు తోడు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో రాజస్తాన్‌ 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ అజింక్యా రహానే 36(20 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్సు),  బెన్‌స్టోక్స్‌ 27(21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సు), జోస్‌ బట్లర్‌ 23( 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సు) త్రిపాఠి 14(5 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సు)లు సైతం వేగంగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసింది.

కోహ్లి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.!
218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఆదిలోనే మెకల్లమ్‌(4) వికెట్‌ను కోల్పయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్‌ కోహ్లి మరో ఓపెనర్‌ డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని డీఆర్సీ డికాక్‌ 26(19 బంతుల్లో 4 ఫోర్లు)ను ఔట్‌ చేసి విడదీశాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం కోహ్లి 26 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. మరికొద్ది సేపటికే బెంగళూరు కోహ్లి 57 (30 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్సులు), డివిలియర్స్‌ 20(18 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సు), పవన్‌నేగి(3) వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. ఇక చివర్లో వాషింగ్టన్‌ సుంధర్‌ 35 (19 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సులు), మన్‌దీప్‌ సింగ్‌ 47( 25 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు,నాటౌట్‌) పోరాడిన లక్ష్యం భారీగా ఉండటంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేసి 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాజస్తాన్‌ బౌలర్లలో గోపాల్‌(2), గౌతమ్‌, స్టోక్స్‌, డీఆర్సీ షార్ట్‌ , బెన్‌ లాఫ్లిన్‌లు తలో వికెట్‌ తీశారు.  

శాంసన్‌ వీరవిహారం..
కెప్టెన్‌ అజింక్యా రహానే వికెట్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌ కొడితే.. సిక్సరే! అన్నట్లు చెలరేగాడు. ఈ దశలో 34 బంతుల్లో 5 సిక్సులతో శాంసన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా పది సిక్సులతో వీరవిహారం చేశాడు. లాంగాన్‌, లాంగాఫ్‌, స్ట్రెయిట్‌ డ్రైవ్‌ షాట్‌లతో ఔరా అనిపించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌ ఆరేంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు.

>
మరిన్ని వార్తలు