గెలిచేదెవరు.. నిలిచేదెవరు

19 May, 2018 15:52 IST|Sakshi
కోహ్లికి మొక్కలను అందజేస్తున్న రహానే

ఇరు జట్లకు చావోరేవో మ్యాచ్‌

రాజస్తాన్‌దే బ్యాటింగ్‌

జైపూర్‌ : ఐపీఎల్‌-11 సీజన్‌లో మరో రసవత్తర మ్యాచ్‌కు సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికైంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఎలాంటి మార్పుల్లేకుండా కోహ్లి సేన బరిలోకి దిగుతుండగా.. రాజస్తాన్‌కు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. జోస్‌ బట్లర్‌, బెన్‌స్టోక్స్‌లు టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ తిరుగు పయనమైన విషయం తెలిసిందే. వీరి స్థానంలో బెన్‌ లాఫ్లిన్‌, హెన్రీచ్‌ క్లాసెన్‌లు తుదిజట్టులో వచ్చారు. ఇక టాస్‌ సందర్భంగా రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే, ఆర్సీబీ సారథి విరాట్‌ కోహ్లికి మొక్కలను అందజేశాడు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో కోహ్లి, రహానేకు మెక్కను అందజేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌నే విజయం వరించింది. 

చావోరేవో మ్యాచ్‌..
ఇక ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు చావోరేవోలాంటింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఇరుజట్లు 6 మాత్రమే గెలిచి 12 పాయింట్లతో ఐదు, ఆరుస్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే ఇరు జట్లు ఈ మ్యాచ్‌ తప్పక గెలవాల్సిందే. గెలవడమే కాకుండా మెరుగైన రన్‌రేట్‌ కూడా సాధించడం కీలకమే. ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు ఇతర మ్యాచ్‌ ఫలితాల కోసం వేచిచూడాల్సి ఉంటుంది. అప్పుడు రన్‌రేట్‌ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఉత్సహంగా బరిలోకి దిగుతున్నాయి. అనూహ్యంగా వరుస విజయాలనందుకున్న ఆర్సీబీ ఈ మ్యాచ్‌ ఎలాగైన గెలవాలని భావిస్తోంది. రాజస్తాన్‌ రాయల్స్‌ పరిస్థితి మాత్రం కఠినంగానే ఉంది.  ఇప్పటి వరకు అండగా నిలిచిన జోస్‌ బట్లర్‌ దూరం కావడం ఆ జట్టును కలవరపెడుతోంది.

తుది జట్లు
ఆర్సీబీ: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), పార్థీవ్‌ పటేల్‌, ఏబీ డివిలియర్స్‌, మొయిన్‌ అలీ, గ్రాండ్‌ హోమ్‌, మన్‌దీప్‌ సింగ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, టీమ్‌ సౌథి, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, యుజువేంద్ర చహల్‌

రాజస్తాన్‌ : రాహుల్‌ త్రిపాఠి, అజింక్య రహానే, సంజూ శామ్సన్‌, హెన్రీచ్‌ క్లాసెన్‌, కే గౌతమ్‌, శ్రేయస్‌ గోపాల్‌, స్టువర్ట్‌ బిన్నీ, జోఫ్రా ఆర్చర్‌, బెన్‌ లాఫ్లిన్‌, ఇష్‌ సోదీ, జయదేవ్‌ ఉనద్కట్‌

మరిన్ని వార్తలు