'అప్పుడు వారు.. ఇప్పుడు వీరు'

16 Dec, 2017 12:59 IST|Sakshi

ముంబై: భారత క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేసిన అనిల్‌ కుంబ్లే దాదాపు ఐదు నెలల క్రితం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో విభేదాలు కారణంగా కుంబ్లే తన పదవి నుంచి తప్పుకున్నాడన్నది కాదనలేని సత్యం. అయితే వీరిద్దరి వివాదాన్ని సుమారు 65 ఏళ్ల నాటి సంఘటనతో పోల్చారు రామచంద్ర గుహ. బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యత్వానికి ఆరు నెలల క్రితం రాజీనామా చేసిన గుహ.. తొలిసారి క్రికెట్‌ గురించి బహిరంగంగా పెదవి విప్పారు. కొన్ని నెలల క్రితం కోహ్లి-కుంబ్లేల మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని 1952లో సీకే నాయుడు-వినూ మన్కడ్‌ వివాదంతో పోల్చారు. బాంబే జింఖానా మైదానంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గుహ మాట్లాడారు.


'బీసీసీఐ పరిపాలకుల కమిటీకి ఆరు నెలల క్రితం రాజీనామా చేశాను. ఆ తర్వాత క్రికెట్‌పై బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి. 1952లో కల్నల్‌ సీకే నాయుడు, వినూ మన్కడ్‌ మధ్య పెద్ద వివాదం నడిచింది. ఆ సమయంలో నాయుడు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉండగా,. వినూ మన్కడ్‌ అద్భుతమైన క్రికెటర్‌. అది భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించిన సమయం. లంకాషైర్‌ నుంచి మన్కడ్‌కు ఓ ఒప్పందం ప్రతిపాదన వచ్చింది. జట్టులోకి తీసుకుంటారని నాకు హామీ ఇస్తే లంకషైర్‌తో ఒప్పందం కుదుర్చుకోనని మన్కడ్‌ బీసీసీఐకి తెలిపారు. ‘మేమెలాంటి హామీ ఇవ్వలేం అని అందుకు నాయుడు బదులిచ్చారు. ఆ క్రమంలోనే లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడింది. మన్కడ్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 72, రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులు చేశాడు. అప్పుడు సీకే నాయుడు, మన్కడ్‌కు మధ్య వివాదం ఏ విధంగా జరిగిందో.. ఇప్పుడు కోహ్లి-కుంబ్లేల మధ్య జరిగింది. కాకపోతే అప్పుడు క్రికెట్‌ పరిపాలకులది పైచేయి ఉంటే.. ఇప్పుడు ఆటగాళ్లే క్రికెట్‌ పరిపాలన విధానాన్ని శాసిస్తున్నారు' అని గుహ అభిప్రాయపడ్డాడు. 

మరిన్ని వార్తలు